చెర్లపల్లి సెంట్రల్ జైలులో మత్తు విముక్తి కేంద్రం

చెర్లపల్లి సెంట్రల్ జైలులో మత్తు విముక్తి కేంద్రం

  • “నివృత్తి” ని ప్రారంభంచిన గవర్నర్ 

విశ్వంభర, జిహెచ్ఎంసి: చెర్లపల్లి సెంట్రల్ జైలులో “నివృత్తి” మత్తు విముక్తి కేంద్రాన్ని మంగళవారం తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా  ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి మహిళ, శిశు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ కార్యదర్శి  అనితా రామచంద్రన్, వికలాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్  బి. శైలజ , డీసీపీ, ఉప్పల్ జోన్ కె. సురేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్  మాట్లాడుతూ, మత్తు పదార్థాల దుర్వినియోగం ఒక తీవ్రమైన సామాజిక, ప్రజా ఆరోగ్య సమస్యగా నిలుస్తోందని, దీనిని సమగ్రంగా  ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తన రాజకీయ జీవితంలో అనేకసార్లు జైలుకు వెళ్లిన అనుభవం వల్ల ఖైదీలు,జైలు సిబ్బంది ఎదుర్కొనే సమస్యలను తాను బాగా అర్థం చేసుకున్నానని పేర్కొన్నారు. జైలు శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో జైలు పరిస్థితుల మెరుగుదలకు, సిబ్బంది సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నానని చెప్పారు. ఖైదీలకు మానవీయ వాతావరణం కల్పించేందుకు జైళ్లలో ఫ్యాన్లు, టీవీలు వంటి సౌకర్యాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా సంస్కరణాత్మక కారాగార వ్యవస్థను బలోపేతం చేయడంలో తన మద్దతు కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణ కారాగార శాఖ సంస్కరణాత్మక, మానవీయ దృక్పథంతో ముందుకు సాగుతున్నందుకు అభినందించారు. ముఖ్యంగా డా. సౌమ్య మిశ్రా నాయకత్వంలో జైళ్లలో మత్తు విముక్తి కేంద్రాల ఏర్పాటు వంటి వినూత్న కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ సందర్భంగా డా. సౌమ్య మిశ్రా మాట్లాడుతూ,  చెర్లపల్లి జైలులో మత్తు విముక్తి కేంద్రం స్థాపన జైలు సంస్కరణల దిశగా ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. మత్తు వ్యసనం కేవలం శిక్షాత్మక అంశం కాకుండా ప్రజా ఆరోగ్య సమస్యగా పరిగణించి వైద్య చికిత్స, కౌన్సెలింగ్ , నిరంతర పునరావాసం ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జైలు నుంచి విడుదలైన తరువాత కూడా ఖైదీలను ఫాలోఅప్ చేస్తూ మత్తు విముక్తి కేంద్ర సిబ్బంది సహాయం అందిస్తున్నారని తెలిపారు. కౌన్సెలింగ్ , థెరపీ ద్వారా అనేక మంది ఖైదీలు తమ జీవితాలను మార్చుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. మొత్తం 2,915 మంది ఖైదీలను స్క్రీనింగ్ చేయగా, 590 మంది ఖైదీలు కౌన్సెలింగ్, చికిత్స పొందినట్లు తెలిపారు. జైళ్లు ప్రస్తుతం సంస్కరణ కేంద్రాలుగా మారుతున్నాయని, ఖైదీలు గౌరవప్రదంగా తమ జీవితాలను పునర్నిర్మించుకునే అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. “నివృత్తి” కేంద్రాలు వైద్య సేవలు, మానసిక కౌన్సెలింగ్, పునరావాస సహాయం అందిస్తూ కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ప్రారంభోత్సవం అనంతరం గవర్నర్ చెర్లపల్లి ప్రిజనర్ అగ్రికల్చరల్ కాలనీని సందర్శించారు. అక్కడ ఖైదీలు , సిబ్బందితో మాట్లాడి వ్యవసాయ, వృత్తి ఆధారిత, సంస్కరణాత్మక కార్యక్రమాలను పరిశీలించారు. బ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన “ఏరియా 77” నేచర్ క్యాంప్, అడ్వెంచర్ పార్క్ను సందర్శించి ప్రశంసించారు. ఈ ప్రాజెక్ట్ ఓపెన్ ఎయిర్ జైలు ఖైదీలు, విడుదలైన ఖైదీలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, వినోదాత్మక, శిక్షణాత్మక కార్యకలాపాల ద్వారా పునరావాసానికి దోహదపడుతున్నదని పేర్కొన్నారు. అలాగే సేంద్రీయ వ్యవసాయం, తేనెటీగల పెంపకం, ఇతర జీవనోపాధి కార్యక్రమాలను పరిశీలించి ఖైదీలకు నైపుణ్యాలు అభివృద్ధి చేసి, క్రమశిక్షణ, బాధ్యతాభావాన్ని పెంపొందించడంలో ఈ కార్యక్రమాలు కీలకమని అభినందించారు. ఈ కార్యక్రమాలు జైళ్లను సంస్కరణ , సాధికారత కేంద్రాలుగా మారుస్తూ, ఖైదీలు సమాజంలో తిరిగి బాధ్యతాయుత పౌరులుగా స్థిరపడేందుకు సహకరిస్తున్నాయని గవర్నర్  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ ఎన్. మురళీబాబు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ (హైదరాబాద్ రేంజ్) డా. డి. శ్రీనివాస్, సెంట్రల్ ప్రిజన్ హైదరాబాద్ సూపరింటెండెంట్  ఎన్. శివకుమార్ గౌడ్ , చెర్లపల్లి సూపరింటెండెంట్ జి. ప్రమోద్ , పి ఏ సి  చెర్లపల్లి సూపరింటెండెంట్  డి. భరత్ , ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.WhatsApp Image 2026-04-07 at 2.32.05 PM

Tags: