రోడ్డుపై వడ్లు ఆరబోసడం ప్రమాదకరం
సర్పంచ్ సమక్షంలో రైతులతో మాట్లాడిన పోలీసులు
విశ్వంభర, గుండాల: మండల పరిధిలోని రామారం గ్రామంలోని ప్రధాన రహదారులపై ధాన్యం ఆరబోసడం వల్ల వాహనదారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. పంట కోతలు ముమ్మరం కావడంతో రైతులు కల్లాల కొరత కారణంగా రహదారులనే ఆశ్రయిస్తున్నారు. మంగళవారం ఉదయం రహదారిపై ఆరబోసిన వడ్ల కుప్పలను అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, రోడ్లపై వడ్లు ఆరబోసడం వల్ల ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరిది అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. రోడ్లపై ధాన్యం ఆరబోస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రమాదాలు జరిగితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా, వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “రోడ్డు టాక్స్ చెల్లిస్తున్నాము సురక్షిత ప్రయాణం కోసం గానీ, వడ్ల కుప్పల మధ్య ప్రమాదాలకు గురికావడానికి కాదు” అని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్ల కారణంగా వాహనాల టైర్లు జారి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో స్థానిక సర్పంచ్ మచ్చ నాగిరెడ్డి, ఏఈఓ క్రాంతి కుమార్ రైతులకు సూచనలు చేశారు. ధాన్యాన్ని రహదారులపై కాకుండా కొనుగోలు కేంద్రాల్లోనే ఆరబోసుకోవాలని కోరారు. మాజీ సర్పంచ్ ఈరసరపు బిక్షపతి గౌడ్ మాట్లాడుతూ రైతుల ఇబ్బందులు అర్థం చేసుకోవాలని, అదే సమయంలో ప్రయాణికుల భద్రతను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. అలాగే ఐకేపీ కేంద్రాల్లో సదుపాయాలను మెరుగుపరచాలని రైతులు అధికారులను కోరారు. ప్రజా భద్రత దృష్ట్యా అందరూ సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.



