కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
విశ్వంభర, హనుమకొండ: హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం కేంద్రంలోని హసన్పర్తి ట్రైనింగ్ సెంటర్‌లో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను ముఖ్య అతిథిగా హాజరైన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ముఖ్యంగా పేద కుటుంబాల్లో కుమార్తెల వివాహ సమయంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను తగ్గించేందుకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు ఎంతో ఉపయుక్తంగా మారాయని పేర్కొన్నారు.పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనం అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తూ వారి భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాల ప్రయోజనం చేరేలా ప్రజాప్రతినిధులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో హసన్ పర్తి ఎమ్మార్వో కిరణ్ కుమార్,ఏ.ఆర్.ఐ రాజేంద్రప్రసాద్, హానుమకొండ డిప్యూటీ తహసీల్దార్ రియాజుద్దీన్,స్థానిక ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు,తదితరులు పాల్గొన్నారు.



