ప్రభుత్వం బాధ్యత వహించాలి

ప్రభుత్వం బాధ్యత వహించాలి

  • నర్సంపేట ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ  

విశ్వంభర, హైదరాబాదు : నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మాహుతి ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ నాయకత్వం పేర్కొంది. ప్రజలకు సేవలందించే కార్మికుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి రావడం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థ వైఖరి స్పష్టమైందని విమర్శించారు. హైదరాబాదులోని  పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో వర్కింగ్ కన్వీనర్ బుర్ర రాము గౌడ్, కన్వీనర్ హేమ జిల్లోజు మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. తక్కువ జీతాలు, పెండింగ్ బకాయిలు, అధిక పని ఒత్తిడి, సరైన సౌకర్యాల లేమి కారణంగా కార్మికులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని తెలిపారు. తాండూరులో పోలీసులు జారీ చేసిన నోటీసుతో సమ్మెకు మద్దతు ఇవ్వొద్దని హెచ్చరించడం, ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి సమ్మె హక్కు లేదని చెప్పి చర్యలు తీసుకుంటామని ప్రకటించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసిందని పేర్కొన్నారు. ఈ ఒత్తిళ్లు కార్మికులపై మానసిక ప్రభావం చూపి నర్సంపేట ఘటనకు దారితీశాయని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఘటనపై నిష్పక్షపాత విచారణ చేపట్టాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేసి ఆర్థిక సహాయం అందించాలని, ఆర్టీసీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కార్మికుల గౌరవాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.

Tags: