కమీషన్ కోసం కక్కుర్తి .. హమాలీ పేరట పైసా వసూల్
- అయోమయంలో రైతులు
విశ్వంభర, నిజామాబాద్: మాక్లూర్ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అవినీతి ఆరోపణలతో కుదేలవుతున్నాయి. హమాలీ పేరిట అదనపు డబ్బులు వసూలు చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సంచికి రూ.16 నుంచి రూ.18 వరకు వసూలు చేయాలని అధికారులు ఒత్తిడి తెస్తుండగా, లేదంటే ధాన్యం కొనుగోళ్లు నిలిపివేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో రైతులు అయోమయంలో పడిపోతే, అధికారులు క్యాష్ చేసుకుంటున్నారనే ఆరోపణలు మరింత బలపడుతున్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పరిస్థితి ప్రస్తుతం సందిగ్ధంగా మారింది. గత ఐదు నెలలుగా పూర్తి స్థాయి పాలకవర్గాలు లేకపోవడంతో ఈ సంఘాలు అధికారుల ఆధీనంలోనే నడుస్తున్నాయి. పర్సన్-ఇన్చార్జ్లుగా వ్యవహరిస్తున్న అధికారులు ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కమిషన్ల రూపంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ, వాటి నిర్వహణ పూర్తిగా అధికారుల చేతుల్లో ఉండటం సమస్యలకు దారితీసింది. ధాన్యం కాంటా, లోడింగ్ పనులకు కూలీలు ఎప్పటిలాగే సంచికి 5.15 తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నా, కొందరు అధికారులు మాత్రం రూ. 16 నుంచి రూ.18 వరకు వసూలు చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అంతేకాక, సంచికి రూ.2 నుంచి రూ.3 తమకు ఇవ్వాలని షరతు పెట్టి, అప్పుడే కాంటా చేయిస్తామని చెబుతున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితులతో కూలీలు కొనుగోలు కేంద్రాలకు రావడానికే వెనుకాడుతున్నారు. మేము ఎక్కువ తీసుకుంటే మా వాటా ఎందుకు ఇవ్వాలి అంటూ హమాలీలు కూడా నిరాకరిస్తుండడంతో కొనుగోళ్లు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు రైతులు కూడా ఎప్పటిలాగే రూ.15 మాత్రమే చెల్లిస్తామని చెబుతుండడంతో ధాన్యం కాంటా నిలిచిపోయింది. మాక్లూర్ సొసైటీ పరిధిలో సుమారు 15 రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనప్పటికీ, ఇప్పటివరకు ఒక్క గుంజి కేంద్రంలో మాత్రమే కాంటా జరుగుతోంది. అక్కడ రైతులు రూ.17 వరకు చెల్లిస్తుండటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం తరలింపులు కొనసాగుతున్నాయి. మిగతా కేంద్రాల్లో మాక్లూర్ రూ.17, ముల్లంగి రూ.17, డికంపల్లి రూ.16, కల్లడి రూ.16, రామచంద్రపల్లి 5.17 వసూళ్లు జరుగుతున్నాయి. మొత్తంగా మాక్లూర్ పరిధిలోని గ్రామాల్లో దాదాపుగా సంచికి రూ.16 నుంచి రూ.18 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, కొన్ని గ్రామాలకు ఒక అధికారి తన సొంత లారీల ద్వారానే ధాన్యాన్ని తరలించాలని ఒత్తిడి తెస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో ఇతర రవాణా మార్గాలు నిలిచిపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. మొత్తంగా కమిషన్ దందా, అధికారుల తీరుతో మండలంలోని ధాన్యం కొనుగోలు వ్యవస్థ సంక్షోభంలోకి వెళ్లింది. వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.



