రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
- :దున్నపోతుల గండి లిఫ్ట్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
విశ్వంబర, మిర్యాలగూడ: మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని అడవిదేవులపల్లి మండలంలో నిర్మిస్తున్న
దున్నపోతుల గండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి , ఇరిగేషన్ అధికారులు సిఈ శ్రీనివాస్ రెడ్డి , ఎస్ సి మల్లిఖార్జున, ఈఈ కేశవ తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న ఆయన అధికారులకు, కాంట్రాక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. లిఫ్ట్ పనులను పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..పనుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. రైతుల సాగునీటి కష్టాలను తీర్చేందుకు ఈ ప్రాజెక్టు అత్యంత కీలకమని,పనులను త్వరితగతిన పూర్తి చేసి సాగునీటిని రైతులకు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారునిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. రైతుల సంక్షేమం కోసం మన ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. సాగునీటి రంగానికి ప్రాధాన్యతనిస్తూ, ప్రతి ఎకరాకు నీరు అందించాలన్నదే మా లక్ష్యం" అని బత్తుల లక్ష్మారెడ్డి చెప్పారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని, నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్, మండల ప్రసిడెంట్ బాలు నాయక్, స్థానిక సర్పంచ్ లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు బి ఎల్ ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.



