రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె తీవ్రం
డిపోలకే పరిమితమైబస్సులు- కొనసాగిన నిరసనలున
విశ్వంభర, హైదరాబాదు : రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె రెండో రోజు మరింత ప్రభావం చూపింది. బస్సులు రోడ్లపైకి రాకుండా ఎక్కువ శాతం డిపోలకే పరిమితమవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ ఉద్యోగులు హైదరాబాదులో బస్ భవన్ సమీపంలో నిరసనలు చేపట్టారు. సమ్మె ప్రభావం కారణంగా రవాణా సేవలు దాదాపు స్థంభించగా, కొంతమంది ప్రైవేటు డ్రైవర్లతో బస్సులను నడిపించే ప్రయత్నాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో బర్కత్పుర బస్ డిపోలో ప్రయాణికుల సౌకర్యార్థం బయటకు తీసుకెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు డిపో వద్దే ఇనుప స్తంభాన్ని ఢీకొట్టింది. అక్కడ ఉన్న సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే బస్సును ఆపి వెనక్కు పంపించారు. పెద్ద ప్రమాదం తప్పిందని స్థానిక సిబ్బంది తెలిపారు. ఇదిలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా సమ్మె కారణంగా ప్రయాణికుల రాకపోకలు దెబ్బతిన్నాయి. డిపోల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ప్రభుత్వం-కార్మిక సంఘాల మధ్య చర్చలు జరగాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.



