విపక్ష ఎంపీల అరెస్టు ప్రజాస్వామ్యానికి మచ్చ..
తెలంగాణ యువజన కాంగ్రెస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అల్మాస్ ఖాన్
విశ్వంభర,హైదరాబాద్: దేశ రాజధానిలో ఇండియా కూటమి ఎంపీలను అరెస్టు చేయడాన్ని తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్మాస్ ఖాన్ తీవ్రంగా ఖండించారు.దేశంలో జరుగుతున్న ఓట్ల తొలగింపు కర్ణాటకలో 1 లక్ష ఓట్లు, బీహార్‌లో 58 లక్షల ఓట్లు — పై వివరణ కోరిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు విపక్ష ఎంపీలను అరెస్టు చేయడం, ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.
"ఓటు ప్రజల శక్తి. దానిని దొంగిలించడం అంటే ప్రజాస్వామ్యాన్ని చంపడం" అని అల్మాస్ ఖాన్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం తన రాజ్యాంగబద్ధ బాధ్యతను వదిలి, కేంద్ర ఒత్తిడికి తలొగ్గి నిశ్శబ్దంగా వ్యవహరించడం అనుమానాస్పదమని అన్నారు. ఎన్నికల సంఘం వెంటనే వివరణ ఇవ్వాలని, పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రజల ఓటు హక్కు రక్షణలో నిష్పక్షపాతంగా ఉండాలని డిమాండ్ చేశారు.
ఓట్ల దొంగతనానికి నిరసనగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిచ్చారని గుర్తుచేశారు.
"మీ ఓటు మీ భవిష్యత్తు. దాన్ని కాపాడాలంటే మీ గొంతు వినిపించాలి" అని అల్మాస్ ఖాన్ పిలుపునిచ్చారు.



