అణగారిన బిడ్డ "అడ్లూరి "... అదుర్స్!
విశ్వంభర,హైదరాబాద్ : సూర్యభగవానుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత నిజమో... ధర్మపురి లక్ష్మీ నరసింహాస్వామి ఎంతటి మహిగల దేవుడో... ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అడ్లూరి అదుర్స్ అన్నది కూడా అంతే సత్యం. ఎందుకంటే, ఆ నియోజకవర్గంలో ఆయన ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నరో... అక్కడి ప్రజలకు సేవ చేసేందుకు ఎంత తిరిగిండ్రో ఆయనకే తెల్సు, ఆ ప్రాంత ప్రజలకే బాగా తెలుసు. గత కొన్ని పర్యాయాలుగా ఆయనపై డబ్బు దండెత్తాలని చూసింది... దౌర్జన్యం దండెత్తాలని ప్రయత్నించింది... వంచన దండెత్తాలని ఎత్తుగడలు వేసింది... అయితే, అవేవీ పారలేదు. ఎందుకంటే, అడ్లూరి దేనికి దడవని నాయకుడు. కష్టానికి... కష్టపడే తీరుకు నిలువెత్తు నిదర్శమైన నేత గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
బ్రిటిషోడు ఈ దేశాన్ని మొత్తం ఊడ్సుకపొయినంక, పేదోళ్లకు పట్టెడన్నం పెట్టింది కాంగ్రెస్ పార్టీయే. అసలు ఈ దేశంలో సంక్షేమం అంటే ఫస్టు మనకు యాదికొచ్చేది కాంగ్రెసే. అటువంటి పార్టీ నుంచే కాంగ్రెస్ పార్టీ అందించిన సంక్షేమ ఫలాలు అందుకొని... ఒక దళిత నాయకుడు తెలంగాణ రాష్ట్రానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అవడటం అంటే మాములు విషయమా? కానే కాదు. నేను ఎవరి గురించి చెబుతున్నానో మీకు అర్థం అయ్యే ఉండొచ్చు ఇప్పటికే. నూతనంగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఇటీవల మంత్రిగా సేవలందించి అవకాశం ఇస్తే... చాలామంది అదృష్టం అన్నారు. మరికొంత మంది అనూహ్యం అన్నారు. కానీ, నేను మాత్రం... ఆయన అలుపెరగని కష్టానికి వచ్చిన అందలం అంటాను. సుమారు మూడు దశాబ్ధాలకు పైగా ప్రజా సేవ చేసిన ఒక కాంగ్రెస్ కార్యకర్తకి ఆ పార్టీ కట్టిన పట్టం ఇది అంటాను.
ధర్మపురి శాసనసభ్యుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ రాష్ట్ర మంత్రివర్గంలోకి చేరడం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకొని కష్టపడినందుకు తగిన ఫలం లభించింది. మేడారం, ధర్మపురి నియోజకవర్గాల్లో వరుస ఓటములతో కుంగిపోకుండా పట్టువదలని విక్రమార్కుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్. కొన్ని పర్యాయాలుగా పోటీ చేస్తూనే... అంతా సవ్యంగా జరిగితే అడ్లూరి 2009లోనే ఎమ్మెల్యే కావాల్సిన నాయకుడు. 2018లో గెలుపు తలుపుతట్టినంత పని చేసింది. కానీ, విజయం రాలేదు. 2023లో తొలిసారి రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇప్పటిదాకా ఆయనకు ప్రభుత్వం విప్‌గా అవకాశం కల్పించింది. ఒక పేద దళిత కుటుంబంలో జన్మించి... పార్టీలో సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి విద్యార్థి నాయకుడిగా ఎదిగిన అడ్లూరి సౌమ్యుడిగా పేరున్నది. పార్టీ గాడ్ ఫాదర్లు, గ్రాంఢ్ ఫాదర్లు ఎవరూ లేకపోయినా శిఖర స్థాయికి చేరిన నేత ఆయన. రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న లక్ష్మణ్‌కుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా సార్లు గెలుపు సమీపం వరకు వచ్చి ఓటమి చవిచూశారు. అయినా అలుపెరగకుండా ఓపిగ్గా పోటీ చేస్తూ వస్తున్నారు. 2018 ఎన్నికల్లో సుమారు 400 ఓట్ల తేడాతో ఓటమి చెందడంతో లెక్కింపు ప్రక్రియలో లోపంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి, దాదాపు అయిదేళ్ల పాటు పోరాటం సాగించారు. తుది తీర్పు రాకముందే 2023 ఎన్నికలు వచ్చాయి. జగిత్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఒక్క ధర్మపురిలోనే కాంగ్రెస్ గెలవడమంటే ఆయన కష్టం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా చేసిన అనుభవం, పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా పని చేయడం... ఆయనకు పార్టీలో ఉన్న అనుభవాలు అంతా ఇంత కాదు.
అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను మరోసారి అదృష్టం వరించింది. గతంలో ధర్మారం జడ్పీటీసీ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఆ సమయంలో ఆరెపల్లి మోహన్ ఉమ్మడి జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఉన్నారు. అదే సమయంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మానకొండూర్ నుంచి మోహన్ శాసనసభకు ఎన్నికయ్యారు. ఆయన జడ్పీ ఛైర్మన్ స్థానానికి రాజీనామా చేయడంతో లక్ష్మణ్‌కుమార్‌ను ఆ పదవి వరించింది. 2010 నుంచి 2012 వరకు జడ్పీ ఛైర్మన్‌గా, 2013 నుంచి 2014 వరకు ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా వ్యవహరించారు. జడ్పీటీసీ సభ్యుడిగా మొదటిసారి ఎన్నికైనపుడే ఛైర్మన్‌గా, ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే మంత్రిగా నియమితులు కావడం విశేషం. ధర్మపురి శాసనసభ నియోజకవర్గం నుంచి లక్ష్మణ్ కుమార్ తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009-2011 మధ్య కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన పని చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌పై 22,039 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వ విప్‌గా సేవలందించి... మంత్రిగా అవకాశం రావడం అద్భుత విషయం.
అణగారినవర్గాల సంక్షేమానికే మంత్రి తొలి సంతకం
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నిరూపించారు. ఇటీవల ఆయన రాష్ట్ర సెక్రటేరియట్‌లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మంత్రి అడ్లూరి ఈ ఏడాది ఐఐటీల్లో సీట్లు పొందిన ఎస్సీ గురుకుల సొసైటీ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించడం చాలా గొప్ప విషయం. నీట్, జేఈఈలో ప్రతిభ చూపిన మరో 100 మంది విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 844 మంది దివ్యాంగుల స్వయం ఉపాధికి రూ.5 కోట్లు నిధులు మంజూరు చేసి అదుర్స్ అనిపించుకున్నారు. గిరిజన విద్యార్థుల విదేశీ విద్య విద్యార్థుల సంఖ్యను ఏటా 100 నుంచి 500కు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఎస్సీ విద్యార్థుల విదేశీ విద్యకోసం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విదేశీ విద్యానిధి పథకం కింద 2025-26 ఏడాది నుంచి విద్యార్థుల సంఖ్యను 210 నుంచి 500కు పెంచేందుకు ఆర్థికశాఖ అనుమతితో ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటుచేసి, జీవనోపాధికి యూనిట్ల ఏర్పాటుకు రివాల్వింగ్ ఫండ్ కింద రూ.3.55 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో 2,367 సంఘాలు లబ్ధి పొందనున్నాయి. ఎస్టీ గురుకుల సొసైటీ, సంక్షేమశాఖ పరిధిలో గిరిజన విద్యాలయాల మరమ్మతులకు రూ.79.61 కోట్లతో పనులు చేపట్టేందుకు అనుమతిచ్చారు. రాష్ట్రంలో 29 మినీగురుకులాల నిర్వహణ కోసం రూ.17.18 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వెల్లడించారు. ఇదంతా కష్టాలు తెలిసిన నాయకుడు మంత్రిగా ఉండటం వల్లనే జరిగింది.
సాగర్ కేవీ.



