బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్ రిటైర్మెంట్
మోకాలి గాయం వల్లే తప్పుకుంటున్నట్లు వెల్లడి
భారత మహిళల బ్యాడ్మింటన్ ముఖచిత్రాన్ని మార్చేసి, ఎంతోమంది యువ క్రీడాకారిణులకు స్ఫూర్తిగా నిలిచిన సైనా నెహ్వాల్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌కు వీడ్కోలు పలికారు. గత కొంతకాలంగా వేధిస్తున్న మోకాలి గాయం కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె అధికారికంగా ధృవీకరించారు.
విశ్వంభర, స్పోర్ట్స్ బ్యూరో: భారత మహిళల బ్యాడ్మింటన్ ముఖచిత్రాన్ని మార్చేసి, ఎంతోమంది యువ క్రీడాకారిణులకు స్ఫూర్తిగా నిలిచిన సైనా నెహ్వాల్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌కు వీడ్కోలు పలికారు. గత కొంతకాలంగా వేధిస్తున్న మోకాలి గాయం కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె అధికారికంగా ధృవీకరించారు. ఇటీవల సుభోజిత్ ఘోష్‌తో నిర్వహించిన ఒక పాడ్‌కాస్ట్‌లో సైనా తన రిటైర్మెంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. "గత రెండేళ్లుగా నేను క్రానిక్ మోకాలి నొప్పితో బాధపడుతున్నాను. ఎలైట్ స్పోర్ట్స్‌లో రాణించేందుకు అవసరమైన ఫిట్‌నెస్‌ను నా శరీరం అందుకోలేకపోతోంది. అందుకే ఆటకు స్వస్తి పలుకుతున్నాను" అని ఆమె పేర్కొన్నారు. కాగా, 2023 జూన్ నుంచి సైనా ఏ అంతర్జాతీయ టోర్నమెంట్‌లోనూ పాల్గొనలేదు.
చరిత్ర సృష్టించిన ప్రస్థానం..
భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సైనా నెహ్వాల్ ఒక అద్భుత అధ్యాయం. ఆమె సాధించిన విజయాలు అద్వితీయం. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి, బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి ఒలింపిక్ మెడల్ అందించిన క్రీడాకారిణిగా నిలిచారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న తొలి భారతీయ మహిళగా పేరొందారు. 20కి పైగా అంతర్జాతీయ టైటిల్స్, రెండు కామన్వెల్త్ గోల్డ్ మెడల్స్, ఆసియా గేమ్స్ మెడల్స్‌ను ఆమె సొంతం చేసుకున్నారు.
"నేను నా ఇష్టంతోనే ఆటలోకి వచ్చాను, అలాగే నా ఇష్టంతోనే బయటకు వెళ్తున్నాను. దీనికి ఎలాంటి ఫార్మల్ అనౌన్స్‌మెంట్ అవసరం లేదని భావిస్తున్నాను."అని సైనా నెహ్వాల్ పేర్కొన్నారు. రిటైర్మెంట్ తర్వాత కూడా సైనా క్రీడలకు దూరం కావడం లేదు. హర్యానాలో ఒక అత్యాధునిక బ్యాడ్మింటన్ అకాడమీని ఏర్పాటు చేసి, భవిష్యత్ ఛాంపియన్లను తీర్చిదిద్దాలని ఆమె నిర్ణయించుకున్నారు. పీవీ సింధు, లక్ష్య సేన్ వంటి ప్రస్తుత స్టార్లకు సైనా చూపిన బాటే మార్గదర్శకంగా నిలిచింది. ఒక ట్రయల్‌బ్లేజర్‌గా సైనా ప్రస్థానం భారత క్రీడా చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది.



