వారసత్వ కట్టడాల వద్ద యూపీఐ సేవలు

వారసత్వ కట్టడాల వద్ద యూపీఐ సేవలు

దేశంలోని చారిత్రక, సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను సందర్శించే పర్యాటకులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.

విశ్వంభర, నేషనల్ బ్యూరో: దేశంలోని చారిత్రక, సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను సందర్శించే పర్యాటకులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇకపై ఎర్రకోట, తాజ్ మహల్, చార్మినార్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో టికెట్ల కోసం చిల్లర కష్టాలు పడాల్సిన అవసరం లేదు. అన్ని హెరిటేజ్ సైట్లలో యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు భారత పురావస్తు సర్వే సంస్థ (ASI), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అనుబంధ సంస్థ ఎన్‌బీఎస్‌ఎల్‌ (NBSL) కసరత్తు చేస్తున్నాయి.

డిజిటల్ వైపు అడుగులు
ప్రస్తుతం ఏఎస్‌ఐ ఆధ్వర్యంలోని కట్టడాలకు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం ఉన్నప్పటికీ, నేరుగా కౌంటర్ల వద్ద మాత్రం కేవలం నగదు మాత్రమే తీసుకుంటున్నారు. దీనివల్ల పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు టికెట్ కౌంటర్ల వద్ద భీమ్ యూపీఐ సేవలను ప్రారంభించనున్నారు. ప్రతి టికెట్ కౌంటర్ వద్ద క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేస్తారు. సందర్శకులు తమ మొబైల్ ద్వారా స్కాన్ చేసి క్షణాల్లో టికెట్ పొందవచ్చు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు పర్యాటకులకు కొంత మేర క్యాష్‌బ్యాక్ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ఎన్‌బీఎస్‌ఎల్‌ ఎండీ, సీఈఓ నటరాజన్ వెల్లడించారు. విదేశీ పర్యాటకులతో పాటు స్వదేశీయులకు కూడా ఈ విధానం ఎంతో సౌకర్యవంతంగా ఉండనుంది. అన్ని పురావస్తు ప్రదేశాల్లో నగదు రహిత లావాదేవీలను పెంచడమే తమ లక్ష్యమని ఎన్‌బీఎస్ఎల్ ఎండీ నటరాజన్ తెలిపారు. ఎన్‌బీఎస్‌ఎల్‌, ఏఎస్‌ఐ సమన్వయంతో త్వరలోనే ఈ సేవలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

Read More ఏఆర్‌ రెహమాన్‌పై జాలి వద్దు.. ఆయన చాలా రిచ్‌..!