ఆ స్థానాన్ని వారు కుటుంబ ఆస్తిగా భావిస్తున్నారు: ప్రధాని మోడీ
ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. రాయ్‌బరేలి స్ధానాన్ని సోనియా గాంధీ తమ కుటుంబ ఆస్తిగా భావిస్తున్నారని మండిపడ్డారు. జంషెడ్‌పూర్‌లో ఇవాళ (ఆదివారం) ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మీడియాతో మాట్లాడారు.
ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. రాయ్‌బరేలి స్ధానాన్ని సోనియా గాంధీ తమ కుటుంబ ఆస్తిగా భావిస్తున్నారని మండిపడ్డారు. జంషెడ్‌పూర్‌లో ఇవాళ (ఆదివారం) ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మీడియాతో మాట్లాడారు. రాయ్‌బరేలిని వదిలివేసిన కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఇప్పుడు తన కుమారుడు రాహుల్ గాంధీ కోసం ప్రజలను ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు.
రాయ్‌బరేలిలో ప్రచారానికి వెళ్లిన సోనియా గాంధీ తన కొడుకును ప్రజలకు అప్పగిస్తున్నానని చెప్పారని తెలిపారు. అయితే, అక్కడ దీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు ఎవరూ లేరా అని మోడీ ప్రశ్నించారు. కోవిడ్ అనంతరం తన నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడని సోనియా గాంధీ ఇప్పుడు కొడుకు కోసం ఓట్ల వేటకు వచ్చారని ఎద్దేవా చేశారు.
మరోవైపు పార్లమెంటరీ స్ధానాలను సైతం ఈ కుటుంబ పార్టీలు తమ చెప్పుచేతల్లో పెట్టుకుంటున్నాయని ప్రధాని మోడీ మండిపడ్డారు. ఈ తరహా కుటుంబ పార్టీల నుంచి జార్ఖండ్‌ను కాపాడుకోవాలని ప్రధాని ప్రజలకు పిలుపు ఇచ్చారు.
అదేవిధంగా కాంగ్రెస్ యువరాజు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వయనాడ్ నుంచి రాయ్‌బరేలి పారిపోయి వచ్చారని ప్రధాని విమర్శించారు. రెండు లోక్‌సభ స్ధానాల నుంచి రాహుల్ పోటీ చేయడాన్ని మోడీ తప్పుపట్టారు. ఇది తన తల్లి ప్రాతినిధ్యం వహించిన స్ధానమని చెప్పుకుంటూ రాహుల్ తిరుగుతున్నాడని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు.