జనవరి 21 నుంచి అంతర్జాతీయ ఎన్నికల సదస్సు
హాజరుకానున్న 70 దేశాల ప్రతినిధులు
ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికల నిర్వహణలో అత్యాధునిక సాంకేతికతను జోడించే లక్ష్యంతో భారత ఎన్నికల సంఘం (ECI) ప్రతిష్టాత్మక అడుగు వేసింది. న్యూఢిల్లీలోని ‘భారత్ మండపం’ వేదికగా జనవరి 21 నుంచి 23 వరకు మూడు రోజుల పాటు జరగనున్న ‘ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్’ (IICDEM) 2026కు సర్వం సిద్ధమైంది.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికల నిర్వహణలో అత్యాధునిక సాంకేతికతను జోడించే లక్ష్యంతో భారత ఎన్నికల సంఘం (ECI) ప్రతిష్టాత్మక అడుగు వేసింది. న్యూఢిల్లీలోని ‘భారత్ మండపం’ వేదికగా జనవరి 21 నుంచి 23 వరకు మూడు రోజుల పాటు జరగనున్న ‘ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్’ (IICDEM) 2026కు సర్వం సిద్ధమైంది. ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 దేశాలకు చెందిన 100 మందికి పైగా ప్రతినిధులు పాల్గొననున్నారు. ఎన్నికల నిర్వహణలో ఎదురవుతున్న ప్రస్తుత సవాళ్లు, అత్యాధునిక విధానాలు, వివిధ దేశాల్లో అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులపై చర్చ జరగనుంది. ఈ మహాసభను భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కమిషనర్లు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషిలు లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఒకే వేదికపై అన్ని సేవలు
ఈ సదస్సులో ఎన్నికల సంఘం ‘ECINET’ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ఆవిష్కరించనుంది. ఎన్నికలకు సంబంధించిన అన్ని సేవలను ఓటర్లకు, అభ్యర్థులకు ఒకే చోట అందించే ‘వన్-స్టాప్ డిజిటల్ వేదిక’గా ఇది పనిచేయనుంది. సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలైన 2024 లోక్‌సభ ఎన్నికల నిర్వహణ వెనుక ఉన్న భారీ కసరత్తును వివరిస్తూ రూపొందించిన ‘ఇండియా డిసైడ్స్’ డాక్యుమెంటరీ సిరీస్‌ను ఈ వేదికపై ప్రదర్శించనున్నారు. ఐఐటీలు (IITs), ఐఐఎంలు (IIMs) వంటి ప్రతిష్టాత్మక సంస్థల మేధావులు ఈ చర్చల్లో పాల్గొని తమ సూచనలు ఇవ్వనున్నారు. సదస్సులో భాగంగా వివిధ దేశాల మధ్య సుమారు 40కి పైగా ద్వైపాక్షిక సమావేశాలు జరగనున్నాయి. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఎన్నికల సహకారాన్ని పెంపొందించడానికి తోడ్పడనుంది.



