పిఠాపురంలో హింసకు ఆస్కారం.. ఈసీకి ఇంటెలిజెన్సీ రిపోర్ట్!
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ గతవారం ముగిసింది. ఎన్నికల వరకు ప్రచారాలతో హోరెత్తించిన పార్టీలు ఇప్పుడు సైలంట్ అయినా.. ఫలితాల గురించి ప్రజల్లో మాత్రం తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. ఎవరు గెలుస్తారని అంచనా వేయడం చాలా కష్టంగా ఉంది. పోలింగ్ జరిగిన తీరు చూసిన తర్వాత తలపండిన రాజకీయ విశ్లేషకులు ఓ అంచనాకు రాలేకపోతున్నారు. అన్ని పార్టీలు బయటకు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోలోపల భయపడుతున్నట్టు తెలుస్తోంది.
అయితే, ఇప్పుడు అందరి దృష్టి పవన్ కల్యాణ్ పైనే ఉంది. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ ఈసారి ఒకే స్థానం నుంచి పోటీ చేసి పెద్ద సాహసమే చేశారు. తన పోటీ చేసిన పిఠాపురంపై పవన్ ఎంత ఫోకస్ చేశారో.. వైసీపీ కూడా అంతే దృష్టి పెట్టింది. చివరి వరకూ వైసీపీ బలంగా పోరాటం చేసింది. అన్ని రకాల అస్త్రాలు ప్రయోగించింది. పిఠాపురంలో ప్రచారం కోసం వైసీపీ పెద్ద ఎత్తున తన సైన్యాన్ని దించింది. కానీ, పవన్ తరఫున ప్రచారానికి కూడా సెలబ్రిటీలు, ఎన్నారైలు గట్టిగానే వచ్చారు. దీంతో పిఠాపురంలో ఫలితం ఎలా ఉంటుందా అన్న ఉత్కంఠ నెలకొంది.
అటు పిఠాపురంపై ఈసీ కూడా స్పెషల్ ఫోకస్ చేసింది. అక్కడ అల్లర్లు జరిగే అవకాశం ఉందని ముందు నుంచి అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈసీ అనుమానాలు బలపడేలా ఓ వార్త బయటకు వచ్చింది. పిఠాపురంతో పాటు కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో కౌంటింగ్‌కు ముందు, ఆ తర్వాత హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఇంటెలిజెన్సీ అధికారులు ఈసీకి నివేదిక కూడా ఇచ్చారు. ఆ నియోజకవర్గాల్లోని ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావు పేట సహా పలు ప్రాంతాల పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఎన్నికల సంఘం సూచించింది. గొడవలకు ప్రేరేపిస్తారనే అనుమానం ఉన్న వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించింది.