ఈ సారి ఎంతకాలం జైలులో ఉంటానో తెలియదు...నా తల్లిదండ్రలు జాగ్రత్త : కేజ్రీవాల్
విశ్వంభర, ఢిల్లీ : మరో రెండు రోజుల్లో జైలుకు వెళుతున్నానని, ఈ సారి జైళ్లో ఎంతకాలం ఉంచుతారో తెలియదు. కానీ నేను వచ్చే వరకు పథకాలన్ని కొనసాగుతాయని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేసిన ఆయన ప్రజలకు సందేశం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారానికి సుప్రీంకోర్టు నాకు 21 రోజుల సమయం ఇచ్చిందని, అది ముగియడంతో ఎల్లుండి నేను తిరిగి తీహార్ జైలుకు వెళ్తాను అని చెప్పారు. ఈసారి నన్ను ఈసారి ఎంతకాలం జైలులో ఉంచుతారో నాకు తెలియదు. కానీ నియంతృత్వం నుండి దేశాన్ని రక్షించడానికి జైలుకు వెళుతున్నందుకు గర్విస్తున్నానన్నారు.
నేను జైలులో ఉన్నప్పుడు వారు నన్ను లొంగదీసుకోవడానికి ప్రయత్నించారు, కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదని తెలిపారు. నన్ను జైళ్లో ఎన్నో రకాలుగా చిత్రహింసలకు గురి చేశారని, నా మెడిసిన్ కూడా నిలిపివేశారని, వారు ఎందుకు అలా చేశారో.. వారికి ఏం కావాలో నాకు అర్ధం కాలేదన్నారు. నేను జైలుకు వెళ్లినప్పుడు నా బరువు 70 కిలోలు ఉండగా.. ఇప్పడు 64 కిలోలకు వచ్చిందని, ఈ వ్యక్తులు ఏమి చేశారో నాకు తెలియదు కానీ నేను జైలు నుంచి విడుదల అయినప్పటి నుంచి బరువు పెరగడం లేదని తెలిపారు. డాక్టర్లు పలు రకాల టెస్టులు చేసి.. ఇది శరీరంలో ఏదో ఒక తీవ్రమైన వ్యాధికి సంకేతంగా ఉందని తెలిపారని అన్నారు.
ఈ సారి నేను లొంగిపోవడానికి దాదాపు 3 గంటలకు నా ఇంటి నుండి బయలుదేరతానని, ఈసారి వారు నన్ను ఇంకా ఎక్కువగా హింసించవచ్చు, కానీ నేను తలవంచను అని తేల్చి చెప్పారు. నేను ఎక్కడ ఉన్నా.. మీ ఉచిత విద్యుత్, మొహల్లా క్లినిక్‌లు, ఆసుపత్రులు, ఉచిత మందులు, చికిత్స, 24 గంటల కరెంటు మరియు అనేక ఇతర విషయాలు కొనసాగుతాయని, అలాగే నేను తిరిగి వచ్చిన తర్వాత నేను ప్రతీ తల్లి, సోదరికి ప్రతి నెల రూ 1000 ఇవ్వడం ప్రారంభిస్తానని స్పష్టం చేశారు. ఇక ఈ రోజు నేను నా కుటుంబం కోసం మీ నుండి ఒక విషయం అడగాలనుకుంటున్నాను అని, నా తల్లిదండ్రులు చాలా పెద్దవారు. మా అమ్మ చాలా అనారోగ్యంతో ఉంది. జైలులో ఉన్నా కూడా ఆమె గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నానని, నా తర్వాత నా తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని, వారి కోసం ప్రార్థించాలని ప్రజలను కేజ్రీవాల్ కోరారు.