స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం..
20 మంది దుర్మరణం.. 70 మందికి పైగా గాయాలు
స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ హైస్పీడ్ రైలు అదుపుతప్పి పట్టాలు తప్పడమే కాకుండా, పక్కనే ఉన్న మరో రైలును బలంగా ఢీకొట్టింది.
విశ్వంభర, బ్యూరో: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ హైస్పీడ్ రైలు అదుపుతప్పి పట్టాలు తప్పడమే కాకుండా, పక్కనే ఉన్న మరో రైలును బలంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో 20 మంది మరణించగా, సుమారు 73 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం అందిన సమాచారం మేరకు, హైస్పీడ్ రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పడంతో ఈ పెను ప్రమాదం సంభవించింది. పట్టాలు తప్పిన వేగంలో ఆ రైలు పక్కనే ఉన్న మరో రైలును ఢీకొట్టడంతో బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాద తీవ్రతకు బోగీలు ఒకదానిపైకి ఒకటి ఎక్కి భీతావహ దృశ్యం కనిపించింది.
సహాయక చర్యలు ముమ్మరం..
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక యంత్రాంగం రంగంలోకి దిగింది. గాయపడిన 73 మందిని అంబులెన్స్‌ల ద్వారా సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు రెస్క్యూ టీమ్స్ నిరంతరాయంగా శ్రమిస్తున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని.. సాంకేతిక లోపమా లేక మానవ తప్పిదమా అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై స్పెయిన్ ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.



