ఏడాదిలో లక్ష అమెరికా వీసాల రద్దు
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏడాది కాలంలో అమెరికా విదేశాంగ శాఖ కఠిన నిర్ణయాలు తీసుకుంది.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏడాది కాలంలో అమెరికా విదేశాంగ శాఖ కఠిన నిర్ణయాలు తీసుకుంది. జాతీయ భద్రత, చట్టాల ఉల్లంఘన సాకుతో ఏకంగా లక్ష వీసాలను రద్దు చేసినట్లు సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఇది అమెరికా చరిత్రలోనే రికార్డు స్థాయి రద్దు అని అధికారులు వెల్లడించారు.
మొత్తం రద్దు అయిన లక్ష వీసాల్లో 8,000 విద్యార్థి(F, J కేటగిరి), 2,500 ప్రత్యేక(ఉద్యోగ, ఇతర నిపుణులు) వీసాలున్నాయి. 2024తో పోలిస్తే రద్దుల సంఖ్య 150 శాతం పెరిగింది. కేవలం అనుమానంతో కాకుండా, నిర్దిష్టమైన చట్ట ఉల్లంఘనల ఆధారంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. రద్దుకు నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయని పేర్కొంది. గడువు దాటిన తర్వాత కూడా అమెరికాలో అక్రమంగా ఉండటం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడటం, గొడవలకు పాల్పడటం లేదా ఇతరులపై దాడులు చేయడం, క్రైమ్ రికార్డు ఉన్న వారిని తక్షణమే దేశం నుంచి పంపించి వేయడం వంటి కారణాలు ఉన్నాయి.
సోషల్ మీడియాపై నిఘా!
వీసా ఉన్న వారందరిపై ఇప్పుడు ప్రభుత్వం 'సోషల్ మీడియా వెట్టింగ్' ప్రక్రియను వేగవంతం చేసింది. భద్రతా బలగాలతో తలపడిన వారు, అమెరికా వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు సోషల్ మీడియా ద్వారా తేలితే వారి వీసాలు అక్కడికక్కడే రద్దు చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన 'కంటిన్యూయస్ వెట్టింగ్ సెంటర్' ద్వారా వీసా హోల్డర్ల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అమెరికా పౌరుల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యత అని.. చట్టాలను అతిక్రమించే ఎవరినైనా ఉపేక్షించేది లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు.



