తెలంగాణలో గాలివాన బీభత్సం.. ఏడుగురు మృతి!
తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణ మారిపోయింది. భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు రాష్ట్రంలో ఏడుగురి మృతి చెందారు. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకళ్లలో కోళ్ల ఫారం గోడ కూలి నలుగురు కార్మికులు మృతి చెందారు. అదే జిల్లాలోని తెలకపల్లిలో పిడుగుపాటుకు లక్ష్మణ్ అనే 12 ఏళ్ల బాలుడు చనిపోయాడు. మరో వైపు మేడ్చల్ జిల్లాలో కూడా వాన భారీ నష్టాన్ని మిగుల్చింది. శామీర్‌పేట్ సమీపంలో ఈదురుగాలులకు భారీ వృక్షం విరిగి బైక్ మీద పడింది. ఈ ప్రమాదంలో నాగిరెడ్డి, రామ్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
నారాయణపేట జిల్లా కోస్గిలో వారాంతపు సంతలో గాలివాన బీభత్సం సృష్టించింది. మార్కెట్‌లో రైతులు, వ్యాపారస్థులు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న దుకాణాలపై ఉన్న టార్పాలిన్‌లు చెల్లాచెదురు అయ్యాయి. ఇక హైదరాబాద్‌లో పలు చోట్ల విద్యుత్తు స్థంభాలు విరిగి పడ్డాయి. చెట్లు నేలకొరిగాయి. దీంతో అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ చెట్లు కూలిపోవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వనస్థలిపురం, ఎల్బీ నగర్, సరూర్ నగర్ ప్రాంతాలలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. చెట్లు పడటంతో వాహనాల ధ్వంసమయ్యాయి.
హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట్ ప్రాంతాల్లోనూ వానగాలి బీభత్సం సృష్టించింది. అనేక చోట్ల గుడిసెల పైకప్పులు ఎగిరిపోయాయి. కొన్ని చోట్ల పిడుగులు పడినట్లు కూడా వార్తలు అందుతున్నాయి. విద్యుత్తు లైన్లతో పాటు నెట్, కేబుల్ వైర్లు కూడా రహదారులపై తెగిపడ్డాయి. దీంతో అనేక చోట్ల నెట్ రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.