వైసీపీ ఓటమికి కారణాలు ఇవే..!

వైసీపీ ఓటమికి కారణాలు ఇవే..!

  • సంక్షేమం తప్ప అభివృద్ధి ఏది..?
  • రెడ్లలో తీవ్ర అసంతృప్తి
  • రాజధాని లేకపోవడం మైనస్
  • చంద్రబాబు, పవన్‌ను వ్యక్తిగతంగా అవమానించడం
  • వలంటరీ వ్యవస్థతో కేడర్ డీలా

విశ్వంభర, విజయవాడ:  వైసీపీకి ఘోరమైన దెబ్బ పడింది. ఇప్పటి వరకు వైసీపీ చరిత్రలోని లేని విధంగా దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. గత ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీ సీట్లతో అధికారాన్ని సింగిల్ గా చేజిక్కించుకున్న వైసీపీ.. ఈ ఎన్నికల్లో మాత్రం కనీవినీ ఎరగని రీతిలో ఓటమి పాలైంది. ఓటమి అంటే అది మామూలు ఓటమి కాదు.. ఇంత దారుణంగా ప్రజలు ఇప్పటి వరకు ఏ అధికార పార్టీని వ్యతిరేకించలేదేమో. అంత ఘోరంగా ఓడిపోయింది వైసీపీ. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి వైసీపీని ఇంత దారుణంగా ప్రజలు వ్యతిరేకించడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

సంక్షేమమే.. అభివృద్ధి లేదు..

జగన్ ఐదేండ్ల పాలనలో చూసుకుంటే ఎక్కువగా సంక్షేమం మీదనే దృష్టి పెట్టారు. అంతే తప్ప అభివృద్ధిని ఎక్కడా చూపించలేకపోయారు. పైగా ఏపీకి రాజధాని లేకుండా చేశాడనే అపవాదును కూడా మూటగట్టుకున్నారు. సంక్షేమ పథకాలతో ప్రజల అకౌంట్లలో నేరుగా డబ్బులు వేస్తే వాళ్లు ఓట్లేస్తారని అనుకోవడం అవివేకమే అవుతుంది. అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమమే అంటే ఎవరూ పట్టించుకోరు. అందుకే జగన్ ఓటమిలో ఇది కీలక పాత్ర పోషించింది. 

చంద్రబాబు, పవన్ కు అవమానాలు..

వైసీపీ హయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కు దారుణమైన అవమానాలు జరిగాయి. అవి ప్రజల్లో వారికి సానుభూతిని బాగా పెంచాయి. మరీ ముఖ్యంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని అసెంబ్లీ సాక్షిగా అవమానించడం, పవన్ కల్యాణ్‌ ను పదే పదే మూడు పెళ్లిళ్లు అంటూ వైసీపీ మంత్రులు, నేతలు సెటైర్లు వేయడం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకువచ్చింది. అందుకే ఈ ఎన్నికల్లో వైసీపీకి ఆ ఎఫెక్ట్ పడింది.

రాజధాని లేకపోవడం..

ఏపీలో ప్రధానంగా రాజధాని చుట్టే ఈ ఐదేండ్లు రాజకీయాలు నడిచాయి. చంద్రబాబు అమరావతిని రాజధాని చేస్తే.. జగన్ దాన్ని రద్దు చేయడం తీవ్ర విమర్శలకు తావు తీసింది. అంతే కాకుండా మూడు రాజధానులు అంటూ చట్టం చేయడం.. అది కోర్టులో నిలబడకపోవడంతో.. అసలు ఏపీకి రాజధాని అనేది లేకుండా జగనే చేశాడు అని ప్రతిపక్షాలు బలంగా ప్రచారం చేశాయి. ప్రజల్లో ఇది బాగా ప్రభావం చూపించి చివరకు జగన్ ఓటమికి కారణం అయింది.

రెడ్లలో అసంతృప్తి..

ఏపీలో మద్యం షాపులను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం వల్ల ఒక సామాజిక వర్గం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాకుండా వైసీపీకి మొదటి నుంచి అండగా ఉంటున్న రెడ్డి సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టాడు జగన్. మూడు రాజధానుల పేరుతో రియల్ ఎస్టేట్ ను పడగొట్టాడు. దాంతో రెడ్డి సామాజిక వర్గం తీవ్రంగా జగన్ ను వ్యతిరేకించింది. అంతే కాకుండా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల నినాదం అందుకుని పార్టీలో, ప్రభుత్వంలో రెడ్ల ప్రాధాన్యతను తగ్గించడంతో వారంతా వ్యతిరేకంగా మారారు.

కేడర్ లో ఆగ్రహం..

జగన్ అంటే చాలా మంది కేడర్ కు పిచ్చి ఉండేది. ఒకప్పుడు జగన్ కోసం టీడీపీ నేతలతో కొట్లాడి తలలు పగలగొట్టుకున్న కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు. అయితే జగన్ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేడర్ ను అస్సలు పట్టించుకోలేదు. వలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి కేడర్ ను నీరుగార్చారు. గ్రామాల్లో వైసీపీ కార్యకర్తల్లో ఇది తీవ్రంగా వ్యతిరేకతను తీసుకొచ్చింది. దాంతో వారంతా ఈ సారి గట్టిగా పోరాడలేదు. అందుకే ఈ ఎన్నికల్లో వైసీపీకి దారుణమైన దెబ్బ పడింది.

Related Posts