పోలవరంపై తెలంగాణ ‘యూ-టర్న్’!
సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఉపసంహరణ
పోలవరం ప్రాజెక్టుతో పాటు నల్లమలసాగర్‌కు సంబంధించిన అంశాలపై గతంలో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
విశ్వంభర, బ్యూరో: పోలవరం ప్రాజెక్టుతో పాటు నల్లమలసాగర్‌కు సంబంధించిన అంశాలపై గతంలో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన దరఖాస్తుకు న్యాయస్థానం పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. విచారణ అనంతరం తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.ఆర్టికల్ 131, సివిల్ సూట్ రూపంలో మళ్లీ రావాలని సీజేఐ సూచించారని, ఆయన సూచన మేరకు పిటిషన్‌ను ఉపసం హరించుకున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని భద్రాచలం పరిసర ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని, బ్యాక్ వాటర్ ప్రభావంపై శాస్త్రీయ అధ్యయనం చేయాలని గతంలో తెలంగాణ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పిటిషన్‌ను కొనసాగించాల్సిన అవసరం లేదని, దీనిని వెనక్కి తీసుకునేందుకు అనుమతించాలని తెలంగాణ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతినిస్తూ కేసును ముగించింది.
ఎందుకీ నిర్ణయం..?
పోలవరం బ్యాక్ వాటర్ అంశంపై ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాలతో చర్చలు జరుగుతుండటం, అలాగే అపెక్స్ కౌన్సిల్ పరిధిలో ఈ వివాదాలు పరిశీలనలో ఉండటంతో.. న్యాయపోరాటం కంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ అడుగు వేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. నల్లమలసాగర్‌కు సంబంధించి కూడా నీటి కేటాయింపులు, ప్రాజెక్టు డిజైన్లపై గతంలో అభ్యంతరాలు ఉండేవి. అయితే ప్రస్తుతం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) పరిధిలోకి ప్రాజెక్టుల నిర్వహణ వెళ్తున్న తరుణంలో, బోర్డు ద్వారానే సమస్యలను తేల్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం.



