19న శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల విడుదల

అధికారిక వెబ్‌సైట్‌లోనే బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి

19న శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల విడుదల

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తుల సౌకర్యార్థం 2026 ఏప్రిల్ నెలకు సంబంధించిన వివిధ దర్శన, సేవా టికెట్ల కోటాను విడుదల చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) షెడ్యూల్‌ను ప్రకటించింది. 

విశ్వంభర, ఏపీ బ్యూరో: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తుల సౌకర్యార్థం 2026 ఏప్రిల్ నెలకు సంబంధించిన వివిధ దర్శన, సేవా టికెట్ల కోటాను విడుదల చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) షెడ్యూల్‌ను ప్రకటించింది. శ్రీవారి ఆర్జిత సేవలు (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) టికెట్లను ఈ నెల 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఎలక్ట్రానిక్‌ లక్కీడిప్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఈ నెల 21న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ-టికెట్లు పొందిన వారు జనవరి 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే.. టికెట్లు మంజూరవుతాయి. 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా, సాలకట్ల తెప్పోత్సవాలు,  సాలకట్ల వసంతోత్సవాల టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. వర్చువల్‌ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

Read More 25 తర్వాత రాజకీయ రంగ ప్రవేశం: విజయసాయిరెడ్డి

23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ దర్శన టికెట్ల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్‌ కోటాను విడుదల చేస్తారు. మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి సేవ, పరకామణి సేవ కోటాను ఈనెల 27న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. 

టికెట్ల బుకింగ్ కోసం భక్తులు కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ మాత్రమే సందర్శించాలని అధికారులు కోరారు. నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Tags: AP TTD