Chandrababu Naidu: భూముల వివాదంపై చంద్రబాబు సీరియస్.. అక్కడ ఆయన ఫొటో ఎందుకు?

Chandrababu Naidu:  భూముల వివాదంపై చంద్రబాబు సీరియస్.. అక్కడ ఆయన ఫొటో ఎందుకు?

Chandrababu Naidu: గత ప్రభుత్వం అమలు చేసిన భూ విధానాలు అస్తవ్యస్తంగా, ప్రజల హక్కులకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు.

Chandrababu Naidu: గత ప్రభుత్వం అమలు చేసిన భూ విధానాలు అస్తవ్యస్తంగా, ప్రజల హక్కులకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు. ప్రజల భూములను తమ ఆధీనంలోకి తీసుకునే ఉద్దేశంతోనే ప్రమాదకరమైన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు. అదే కారణంతో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేస్తూ రెండో సంతకం చేశానని స్పష్టం చేశారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలోని రాయవరంలో నిర్వహించిన ‘మీ భూమి మీ హక్కు’ కార్యక్రమాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కొందరు రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను అందజేసి, వాటిపై ఉన్న క్యూఆర్ కోడ్ మరియు ఆధునిక సాంకేతికతను స్వయంగా పరిశీలించారు.

Read More బరితెగించిన మట్టి మాఫియా

తదుపరి ప్రజావేదికపై మాట్లాడిన చంద్రబాబు, భూమిపై గత పాలకుల అహంకారాన్ని ప్రశ్నించారు. “మన పూర్వీకులు కష్టపడి సంపాదించిన భూమిపై వారి ఫొటోలు ఎందుకు? సరిహద్దు రాళ్లపై వారి ముద్రలు ఎందుకు?” అని గతంలోనే తాను నిలదీసిన విషయాన్ని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకపోయి ఉంటే, ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో ప్రజల భూములను తమకు నచ్చిన వారికి కట్టబెట్టే కుట్ర జరిగేదని ఆయన ఆరోపించారు.

ఇటీవలి కాలంలో రాజకీయాల్లోకి వచ్చిన కొందరు వ్యక్తులు ప్రజల భూముల వివరాలను విదేశాల్లోని తమ అనుచరుల చేతుల్లో పెట్టేంత ప్రమాదకర ఆలోచన చేశారని అన్నారు. అయితే ప్రజలు సరైన సమయంలో బ్యాలెట్ ద్వారానే వారికి తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. భూమి రైతుకు కేవలం ఆస్తి మాత్రమే కాదని, అది వారి విశ్వాసం, కుటుంబంతో పెనవేసుకున్న జీవితం అని చంద్రబాబు పేర్కొన్నారు. కరోనా వంటి క్లిష్టకాలంలో అందరూ సెలవులు తీసుకున్నా, దేశానికి అన్నం పెట్టే రైతుకు మాత్రం సెలవు ఉండదని ఆయన గుర్తుచేశారు.

గత పాలకుల కారణంగా ఎక్కడికి వెళ్లినా భూ వివాదాలకు సంబంధించిన వినతులే ఎక్కువగా వస్తున్నాయని, వాటన్నింటినీ పరిష్కరించాలనే సంకల్పంతోనే ‘మీ భూమి మీ హక్కు’ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. స్వర్గీయ ఎన్టీఆర్ కరణం, మునసబు వ్యవస్థలను రద్దు చేసి రైతులకు మేలు చేస్తే ఇతర రాష్ట్రాల్లో సంబరాలు చేసుకున్నారని, కానీ మన రాష్ట్రంలో మాత్రం కొందరు దాన్ని వ్యతిరేకించారని ఆయన గుర్తుచేశారు.

ఇకపై భూ వివాదాలకు తావులేకుండా పూర్తి పారదర్శకతతో భూ రికార్డులను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. తహసీల్దార్ కార్యాలయాలకే పరిమితం కాకుండా గ్రామసభల మధ్యనే పాస్‌పుస్తకాలు పంపిణీ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. పద్ధతి ప్రకారం రీసర్వే నిర్వహించి, రికార్డులు ఎవరూ చెడగొట్టలేని విధంగా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని వినియోగిస్తున్నామని వివరించారు. పాస్‌పుస్తకంపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే క్షణాల్లో భూమికి సంబంధించిన పూర్తి వివరాలు కనిపించేలా వ్యవస్థను రూపొందించామని చెప్పారు.

cm babuరాజముద్రతో కూడినకొత్త పాస్‌పుస్తకాలు రైతులు, భూ యజమానులందరికీ త్వరితగతిన అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.