ఐలాపూర్ భూముల్లోకి హైడ్రా ప్రవేశించే హక్కు లేదు
- న్యాయవాది ముఖీమ్
- మద్దతు తెలిపిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ
విశ్వంభర, అమీన్‌పూర్: సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ భూముల విషయంలో హైడ్రాకు ప్రవేశించే హక్కు లేదని, న్యాయస్థానాల పరిధిలో ఉన్న భూములపై అధికారులు పెత్తనం చేయడం చట్టవిరుద్ధమని న్యాయవాది ముఖీమ్ అన్నారు. బుధవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగతో కలిసి ఆయన మాట్లాడారు. అధికారుల తీరుపై ధ్వజమెత్తారు . బడుగు, బలహీన వర్గాల భూములపై కన్నేసిన రేవంత్ సర్కార్, హైడ్రా పేరుతో దోపిడీకి పాల్పడుతోందని ముఖీమ్ ఆరోపించారు. ఐలాపూర్ భూములకు సంబంధించి తమకు అనుకూలంగా కోర్టు డిక్రీ ఉందని, ఈ విషయంలో రెవెన్యూ లేదా హైడ్రా అధికారులు జోక్యం చేసుకునే హక్కు లేదని స్పష్టం చేశారు. ఐలాపూర్ భూముల్లో నిత్యం హైడ్రా వాహనాలు తిరుగుతూ, వ్యవసాయం చేసుకుంటున్న రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కోర్టు పరిధిలో ఉన్న భూములపై డ్రోన్ల ద్వారా నిఘా పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాజగోపాల్ నగర్ పేరుతో కొత్తగా ఏర్పడిన ఒక సొసైటీ, హైడ్రా ఉన్నతాధికారి రంగనాథ్‌తో కలిసి ఈ భూముల్లో భారీ కుంభకోణానికి తెరలేపిందని ముఖీమ్ ఆరోపించారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు. రిట్ అప్పీల్ పెండింగ్‌లో ఉన్నందున, హైడ్రా తన నిబంధనలకు లోబడి పనిచేయాలని, కోర్టు ఆదేశాలను ధిక్కరించవద్దని సూచించారు. బాధితులకు న్యాయస్థానాలు రక్షణ కవచంలా ఉన్నాయని, ఎవరూ భయపడవద్దని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఐలాపూర్ భూముల వ్యవహారంలో హైడ్రా, రెవెన్యూ శాఖలు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. కోర్టు తుది తీర్పు వచ్చే వరకు రైతులను ఇబ్బంది పెట్టకుండా అధికారులను కట్టడి చేయాలని సూచించారు. కోర్టు పరిధిలో లేని, వివాదాస్పదం కాని భూముల్లోకి ప్రభుత్వం లేదా హైడ్రా వెళ్లడం సమంజసం కాదు. రైతుల చట్టబద్ధమైన హక్కులను కాలరాయొద్దు. హైడ్రా తన పరిధిని మించి వ్యవహరిస్తోందన్న ఆరోపణలపై ముఖ్యమంత్రి సమీక్ష జరపాలి. ప్రభుత్వమే వెనకుండి ఇదంతా చేయిస్తోందన్న విమర్శలు రాకుండా పారదర్శకతను నిరూపించుకోవాలి అని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఐలాపూర్ గ్రామస్తులు, బాధితులు మరియు పలువురు రైతులు పాల్గొన్నారు.



