అసెంబ్లీకి రాని కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు ? -కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారంటూ బీఆర్ఎస్‌పై ఫైర్
అన్నీ సక్రమంగా ఉంటే విద్యుత్తు సంస్థలు నష్టాల్లోకి ఎందుకు వెళ్లాయని ప్రశ్న
హైద్రాబాద్ , విశ్వంభర :- బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో చెప్పాలని, సభకు రాని ఆయనకు ఇంకా ప్రతిపక్ష హోదా ఎందుకని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో నేడు ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేడు ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తోందని మండిపడ్డారు. నష్టాల్లో కూరుకుపోయిన డిస్కంలను లాభాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్న తమను ప్రశంసించకపోగా తిరిగి నిందలు వేయడం సరికాదన్నారు.
విద్యుత్తు శాఖపై గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. అన్నీ సక్రమంగా ఉంటే మరి విద్యుత్తు సంస్థలు నష్టాల్లోకి ఎందుకు వెళ్తాయని ప్రశ్నించారు. రైతులకు అరకొరగా ఉచిత విద్యుత్తు ఇచ్చి బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుందని, నిజానికి నాడు, నేడు ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నది ఒక్క కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఇప్పటికైనా తమపై నిందలు వేయడం మాని, చేసిన తప్పులు ఒప్పుకోవాలని హితవు పలికారు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి