నీ సొంత ఎజెండా కోసం సీఎం పదవి కాదు.. రేవంత్ పై ఈటల ఫైర్..
ముఖ్యమంత్రి పదవి అంటే రాజ్యాంగబద్దమైనదని.. అలాంటి పవిత్రమైన పదవిని సొంత ఎజెండా కోసం ఎలా వాడుతారంటూ సీఎం రేవంత్ రెడ్డి మీద ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. హైదరాబాద్ ఎల్బీనగర్ లో ఆదివారం జరిగిన కృతజ్ఞతా సభలో ఈటలను సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ ప్రధానంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు.
ఒక ముఖ్యమంత్రిని పనుల నిమిత్తం కలిసినంత మాత్రాన దాన్ని వేరే విధంగా ఆపాదించవద్దని తెలిపారు ఈటల రాజేందర్. ముఖ్యమంత్రి అంటే పార్టీ కాదని.. పార్టీ వ్యక్తిగా ప్రవర్తిస్తే అది ప్రజాస్వామ్యాన్ని అవమానించినట్టే అవుతుందని తెలిపారు ఈటల రాజేందర్. మల్కాజిరిగి ప్రజలు పట్టుబట్టి మరీ తనను గెలిపించుకున్నారని.. వారి రుణాన్ని తీర్చుకుంటానని వివరించారు.
తన విజయాన్ని మల్కాజిగిరి ప్రజలకు అందిస్తున్నట్టు తెలిపారు ఈటల రాజేందర్. గతంలో తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలంగాణ కోసం ముఖ్యమంత్రుల వద్దకు దరఖాస్తులు పట్టుకుని వెళ్లేవాడినని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలకు ఆ స్వేచ్ఛ ఉండాలని ఆయన కోరారు. మల్కాజిగిరి ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులోనే ఉంటానని ఆయన వివరించారు. నో అనే పదం తన డిక్షనరీలోనే లేదని తెలిపారు.