సాహితీ వనంలో మహావటవృక్షం కూలింది-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- అందెశ్రీ కుటుంబానికి సంతాపం తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
తెలంగాణ రాష్ట్ర గీతమైన జయజయహే తెలంగాణ రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి లోనయ్యారు. అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని ఆయన అన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన రచించిన జయజయహే తెలంగాణ గీతం జాతి గొంతుకై.. అందరిని ఒక్కతాటి మీదకు తీసుకువచ్చిందన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆయన చేసిన సాహితీ కృషి చరిత్ర ఉన్నంతత వరకూ నిలిచిపోతుందని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆయన రచించిన జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించిన రోజున ఆయన ఎంతో ఉద్విగ్నతకు లోనైన విషయాన్ని భట్టి విక్రమార్క గుర్తు చేసుకున్నారు. అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. ఆయనతో కలిసి పంచుకున్న దార్శనిక ఆలోచనలు అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలు అందాలన్న తపపను ఉప ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాహితీవనంలో నిఠారుగా ఎదిగిన మహా వటవృక్షం నేలకూలిట్లుగా ఆయన మరణం ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన సంతాపాన్ని ప్రకటించారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.



