గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించాలి

గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించాలి

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలపై ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి సమస్యలు పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం పోరు యాత్రలో భాగంగా మండలంలోని శోభనాద్రిపురం, నీర్నెముల గ్రామాల్లో స్థానిక సిపిఎం నాయకులతో కలిసి సమస్యలు పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా శోభనాద్రిపురం గ్రామంలో వడ్డెవాగుపై వంతెన నిర్మాణం చేయకపోవడంతో వందలాది మంది రైతులకు ఇబ్బందికరంగా మారిందని అన్నారు. స్మశాన వాటికకు ప్రధాన రహదారి కావడంతో అంత్యక్రియల సమయంలో మోకాళ్ళ లోతు నీళ్ల నుండి నడుచుకుంటూ పోవాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. నీర్నెముల గ్రామంలో మంచినీటి ఓఎచ్ఆర్ ట్యాంకు నిచ్చెన శిథిలావస్థకు చేరి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ పట్టించుకోవడం లేదని, గ్రామానికి అంతటికి ప్రధాన నీటి వనరు అయిన ట్యాంకును కడిగే పరిస్థితి లేదని అన్నారు. దాని మూలంగా ప్రజారోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని పలుమార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించి రైతులకు నష్టం జరగకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యవర్గ సభ్యుడు, మాజీ సర్పంచ్ బోయిని ఆనంద్, మండల కమిటీ సభ్యులు ఎండీ రషీద్, మాజీ వైస్-ఎంపీపీ నాగటి ఉపేందర్, శాఖ కార్యదర్శిలు గోగు లింగస్వామి, నాగటి లక్ష్మణ్, మేడి ముకుంద, కొమ్ము అంజయ్య, ఎండీ లతీఫ్, నాగటి అంజయ్య, పాల్వాయి చంద్రశేఖర్ రెడ్డి, వడ్లకొండ రమేష్, బోడిగే వెంకటేష్, బోయిని మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: