తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు
- ఉపాధి వేతనాల విడుదలకు కేంద్రానికి డిమాండ్
- పెసా చట్టం అమలుకు శిక్షణ కార్యక్రమాలు త్వరలో
- మంత్రి దనసరి అనసూయ
విశ్వంభర, హైదరాబాదు : వేసవి నేపథ్యంలో వచ్చే రెండు మూడు నెలలు కీలకమని, ఈ సమయంలో ఎక్కడా తాగునీటి కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ పేర్కొన్నారు. ప్రజలు నీటిని వృథా చేయకుండా వినియోగించేలా అవగాహన పెంచాలని సూచించారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మిషన్ భగీరథ తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పథకం అమలు, పెసా చట్టం అమలుపై సమీక్షించారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లలో తాగునీటి అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు. కృష్ణా, గోదావరి బేసిన్ల నుంచి నీటి కేటాయింపులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. నీటి సరఫరాపై రోజువారీ నివేదికలు సమర్పించాలని, ఎక్కడైనా కొరత తలెత్తితే వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పైప్‌లైన్ లీకేజీలు, సరఫరా లోపాలను త్వరగా సరిచేయాలని సూచించారు. ఉపాధి హామీ పథకంలో నెట్‌వర్క్ సమస్యల వల్ల హాజరు నమోదులో ఇబ్బందులు ఉన్నాయని పేర్కొన్నారు. వేతనాల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పనిదినాలను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పెసా చట్టం అమలుపై దృష్టి సారిస్తూ, గ్రామ పంచాయతీలలో పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి అధికారులకు, ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంజయ్ కుమార్, దివ్య దేవరాజన్, కృపాకర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.



