రేపటి నుంచి యాదాద్రిలో లక్ష్మీ నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు..
విశ్వంభర, వెబ్ డెస్క్ : యాదగిరిశుడి ఆలయంలో ఈనెల 20 నుంచి 22వ తేదీ వరకు లక్ష్మీ నరసింహ స్వామి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు. యాదగిరిగుట్టతో పాటు అనుబంధ ఆలయాలైన పాతగుట్ట, దబ్బకుంటపల్లిలో కూడా వార్షికోత్సవాలు నిర్వహించనున్నారు.
ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20వ తేదీ ఉదయం స్వస్తివచనం, పుణ్యాహవచనం, లక్ష కుంకుమార్చన పూజలతో పాటు తిరువేంకటపతి అలంకార సేవాోత్సవం నిర్వహించనున్నారు. సాయంత్రం మృత్స్యుంగ్రహణం, అంకురార్పణ, హవనం, గరుడ వాహనం, పరవాసుదేవ అలంకార సేవలు నిర్వహిస్తారు.
21న ఉదయం నిత్యమూలమంత్ర హవనం, లక్షపుష్పార్చన, కాళీయమర్ధన అలంకార సేవోత్సవం ఉంటాయన్నారు. సాయంత్రం నారసింహ మూల మంత్ర హవనం, నిత్య పూర్ణాహుతి, గర్భాలయంలో మూలాలకు సహస్ర కలశాభిషేకం, రాత్రి నరసింహ జయంతి, ఆవిర్భావ, మహానివేదన ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. పాతగుట్ట ఆలయం యథావిధిగా కొనసాగుతుందని ఆలయ ఈఓ తెలిపారు.
దబ్బకుంటపల్లి నరసింహస్వామి ఆలయంలో ఈ నెల 22న ఉదయం 11 గంటలకు స్వస్తివాచనం, విశ్వక్సేనపూజ, అభిషేకం, స్వామివారి కల్యాణం, మహానివేదన, తీర్థప్రసాద గోష్టి ఆశీర్వాదం ఉంటాయన్నారు.