కేసీఆర్ ఫ్యామిలీ..అలీబాబా 40 దొంగల ముఠా..
అందులో కొత్త ప్రభాకర్ రెడ్డి ఓ సభ్యుడు :జగ్గారెడ్డి
- ప్యాకేజీ లీడర్ వి నువ్వు...పబ్లిక్ లీడర్ నీ నేను..
- నీకున్నంత ఆస్తి నాకు ఉంటే గంటలో పేదలకు పంచేసే వాణ్ణి
- నీకున్న వెయ్యి కోట్లు రైతులకు పంచేంత దమ్ము నీకు ఉందా..?
- రాజకీయంగా నువ్వెంత..నీ బతుకెంత..నా వెంట్రుక కి కూడా పనికి రావు
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై నిప్పులు చెరిగిన జగ్గారెడ్డి
విశ్వంభర,హైదరాబాద్ : నువ్వెంత , నీ బతుకెంత అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు . శుక్రవారం గాంధీభవన్‌లో మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ నువ్వు నా క్యారెక్టర్ అంచనా వేయలేవంటూ కొత్త ప్రభాకర్ రెడ్డికి సూచించారు. రాష్ట్రంలో ఎవర్ని అడిగినా నా క్యారెక్టర్ గురించి చెబుతారన్నారు. నా క్యారెక్టర్‌కి, ప్రభాకర్ రెడ్డి క్యారెక్టర్‌కి చాలా తేడా ఉంటుందని పేర్కొన్నారు.నేను ఎలాంటి వాడినో కేసీఆర్, హరీష్ రావుని అడిగి తెలుసుకోవాలంటూ ప్రభాకర్ రెడ్డికి సూచించారు. రాష్ట్ర ఖజానాని ఎలా దోచుకోవచ్చో అనే విషయంలో కెసిఆర్ ప్రొఫెసర్ అని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. కెసిఆర్ కుటుంబ సభ్యులంతా దోచుకోవడంలో అలీబాబా నలభై దొంగల్లా మారారని, ఆ నలభై మందిలో కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఒకరని ఆయన విమర్శించారు. దొంగలు మీరైతే, నిందలు మాపై వేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతోనే 30 వేల కోట్లు మిగుల్చుకున్నారని ఆయన విమర్శించారు. విద్యుత్తు కొనుగోలు, ఇసుక మాఫియా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని ఆయన విమర్శించారు.. ప్రభాకర్ రెడ్డికి ఉన్నంత ఆస్తి నా వద్ద ఉంటే ప్రజలకి ఎప్పుడో పంచేసే వాడినని తెలిపారు.పంచే గుణం మా అమ్మనాన్న నాకు ఇచ్చిన ఆస్తి అని చెప్పారు. భవిష్యత్తులో నేను రూ. వేల కోట్లు సంపాదించినా వాటిని ప్రజలకే పంచుతానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. నా ఆస్తి నా పిల్లల కోసం కాదని.. ప్రజల కోసమని తెలిపారు. రూ. 1000 కోట్లు కొన్ని గంటల్లోనే పంచేస్తానన్నారు. ప్రభాకర్ రెడ్డికి ఎలా పంచాలో కూడా తెలియదని ఆక్షేపించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి.. నీవు మగాడవయితే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభాకర్ రెడ్డిది నా స్థాయి కాదన్నారు. కొన్ని విషయాల్లో ఎమోషనల్ కావ్వడం నా బలహీనత అని తెలిపారు. ప్రజల సమస్య వింటే వాళ్ళ కంటే ముందు నాకే ఏడుపు వస్తుందన్నారు. నా చుట్టూ పేదలు ఉంటారని.. నా వద్దకు క్యాన్సర్ పేషెంట్లు సైతం వస్తారని జగ్గారెడ్డి చెప్పారు.



