వరంగల్ లో ఆరోగ్యం పై అవగాహన ర్యాలీ
- జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్
విశ్వంభర, హనుమకొండ: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉదయం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని నర్సింగ్ కళాశాల వద్ద నుండి ఎంజీఎం కూడలి వరకు ఆరోగ్యమే మహా భాగ్యం అంశంపై ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ఎంజీఎం కూడలి మీదుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ వరకు కొనసాగింది. ఎంజీఎం కూడలి వద్ద “మనవహారం” కార్యక్రమం నిర్వహించి, ఆరోగ్యమే మహాభాగ్యం అనే సందేశాన్ని ప్రజలకు, బాటసారులకు వివరించారు. అనంతరం ఐఎంఏ హాల్‌లో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రసంగిస్తూ, ఆరోగ్యం కోసం కలిసికట్టుగా విజ్ఞాన శాస్త్రానికి అండగా నిలబడదాం అని పిలుపునిచ్చారు. ప్రజలు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలని, ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా అధికారులు, సిబ్బందికి ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వైవి గణేష్, సంధ్యారాణి, జెడ్పి సిఈఓ రామ్ రెడ్డి, జిల్లా అధికారులు, వైద్యులు, ఎంజీఎం, ప్రాంతీయ కంటి ఆసుపత్రి, సూపరింటెండెంట్లు, జిల్లా అధికారులు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.



