ఉద్యోగాలు ఇచ్చేవారిలా ఎదగండి
- వర్ధమాన ఇంజనీర్లకు ఫైటెక్ ఎంబెడెడ్ డైరెక్టర్ ఉద్బోధ
- అధ్యాపక వికాస కార్యక్రమం ప్రారంభం
విశ్వంభర, సంగారెడ్డి: వర్ధమాన ఇంజనీర్లు ఉద్యోగార్థులుగా కాకుండా, ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలని ఫైటెక్ ఎంబెడెడ్ సేల్స్ డైరెక్టర్ అరుణ్ కుమార్ సింగ్ ఉద్బోధించారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ‘ఎమర్జింగ్ ఐఐవోటీ ధోరణులు, ఆవిష్కరణలు’ అనే అంశంపై నిర్వహిస్తున్న అధ్యాపక వికాస కార్యక్రమాన్ని (ఎఫ్ డీపీ) సోమవారం జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అరుణ్ కుమార్ మాట్లాడుతూ, ఆవిష్కరణలను నడిపించడంలో ఇంజనీర్ల పరివర్తన పాత్రను నొక్కి చెప్పారు. ఇంజనీర్లు కేవలం సేవ కోసం ఉద్దేశించబడలేదని, వారు కొత్త అవకాశాలు, ఉద్యోగ సృష్టికర్తలుగా అభివర్ణించారు. భారతదేశంలో సాఫ్టేవేర్ లో ముందున్నప్పటికీ, స్వదేశీ హార్డ్ వేర్ లేదని, అలాగే ఎన్నో బహుళ జాతి కంపెనీలకు భారతీయులు నేతృత్వం వహిస్తున్నప్పటికీ, మనదైన విశ్వశ్రేణి ఉత్పత్తులు పెద్దగాలేవని విచారం వెలిబుచ్చారు. ఫైటెక్ ఎంబెడెడ్ లో లెక్కలేనన్ని వినూత్న ఉత్పత్తుల రూపకల్పన చేయగల మైక్రోప్రాసెసర్ యూనిట్లను ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారు. కొత్త వాటిని సృష్టించాలని, ఆవిష్కరణలు చేయాలని అభిలషించే వారంతా, తమ దృక్పథాన్ని తక్షణం మార్చుకుని, ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలని అరుణ్ కుమార్ ఉద్బోధించారు.
ఈ శిక్షణా కార్యక్రమాన్ని అంతా సద్వినియోగం చేసుకుని, ఆచరణాత్మక అనుభవాన్ని గడించాలని పిలుపునిచ్చారు. దీనికోసం ఫైటెక్ తో మంగళవారం అవగాహనా ఒప్పందంపై సంతకం చేయబోతున్నట్టు డాక్టర్ శాస్త్రి ప్రకటించారు.
తొలుత, ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి.మాధవి అతిథులను స్వాగతించి, తమ విభాగం ప్రగతి, సాధించిన విజయాలను వివరించారు. ఎఫ్ డీపీ నిర్వాహకుడు ప్రొఫెసర్ పి.త్రినాథరావు వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది. సోమవారం అంతా అధ్యాపకులకు శిక్షణ ఉంటుందని, మంగళ-బుధ వారాలలో విద్యార్థులకు వారి నైపుణ్యాలను పెంచుకునేలా శిక్షణ సాగుతుందని ఆయన వెల్లడించారు.



