విద్యార్థులను కలవరపెడుతున్న జూనియర్ కళాశాల
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ కాలేజీలు శనివారం(జూన్ 1) నుంచి ప్రారంభంకానున్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని జూనియర్ కాలేజీలోకి ప్రవేశిస్తోన్న విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.
విశ్వంభర, నల్లగొండ బ్యూరో: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ కాలేజీలు శనివారం(జూన్ 1) నుంచి ప్రారంభంకానున్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని జూనియర్ కాలేజీలోకి ప్రవేశిస్తోన్న విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. నిజానికి ఇంటర్ ఫస్టియర్ క్లాసులు ప్రారంభమవుతున్నాయన్న పేరేగానీ.. నేటికీ జూనియర్ కాలేజీల్లో కనీస వసతులు కరువయ్యాయి. శిథిల భవనాలు, ఇరుకు గదులు, అత్తెసరు అధ్యాపకులు.. నేటికీ కాలేజీలకు చేరని పాఠ్యపుస్తకాలతో ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థులు స్వాగతం చేయాల్సి వస్తుంది. వాస్తవానికి ప్రభుత్వ జూనియర్ కాలేజీల పరిస్థితి అధ్వానంగా మారుతోంది. పాలకులు వాటి అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నిర్వహణకు అవసరమైన నిధులను ఇవ్వడం లేదు. సంక్షేమ గురుకుల కళాశాలలకు (కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ) ఇస్తున్న ప్రాధాన్యత వీటికి ఇవ్వడం లేదు. దీంతో తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల పరిస్థితి దయనీయంగా మారిపోతున్నది. నిధులేమి, నిర్వహణ భారంతో సతమవుతున్నప్పటికీ ప్రభుత్వ జూనియర్ కాలేజీలు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి.
తెలంగాణవ్యాప్తంగా కాలేజీల పరిస్థితి ఇదీ..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటయ్యే నాటికి 402 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 422కు చేరింది. వాటిలో 18 జూనియర్ కాలేజీలు శిథిలావస్థకు చేరాయి. ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి. ఒక్కో కళాశాలకు రూ.5 కోట్లు అవసరం. దీనిపై గత కొద్ది సంవత్సరాలుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతూనే ఉన్నా.. నిధులు మంజూరు కావడం లేదు. మరోవైపు 24 కళాశాలలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రాంగణాల్లో షిఫ్ట్ విధానంలో నడుస్తున్నాయి. అంటే అటు పాఠశాల, ఇటు ఇంటర్ విద్యార్థులకు ఇబ్బందికరమైన సమయాల్లో తరగతులు నడుస్తున్నాయి. కొన్నిచోట్ల ఇంటర్ విద్యార్థులకు వినియోగించే అవకాశం లేకుండా ఉన్నత పాఠశాలల్లోని మూత్రశాలలకు తాళం వేసుకొని వెళ్తున్నట్లు చెబుతున్నారు. గత ఏడాది వరకు విద్యార్థుల సంఖ్యకు తగినట్లు మూత్రశాలలు లేవు. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేయడంతో గత డిసెంబరులో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని 41 కళాశాలలకు రూ.10.25 కోట్లు, రాష్ట్రంలోని మరో 300 కళాశాలల్లో 599 మూత్రశాలల నిర్మాణానికి రూ.27.55 కోట్లు మంజూరు చేశారు. ఆ పనులు దాదాపు పూర్తికావొచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 150 కళాశాలలకు ప్రహరీ గోడలు లేవు. ఫలితంగా పశువులు, పందులు వంటివి సంచరిస్తుంటాయి. ఆయా కళాశాలలకు ఆనుకుని వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. కొన్నిచోట్ల కళాశాలలు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఇదిలావుంటే.. ప్రభుత్వ జూనియర్ కళాశాల సొంత భవనాలు ఉన్నా చాలినన్ని తరగతి గదులు లేవు. ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీతో పాటు ఒకేషనల్ కోర్సుల నిర్వహణకు ఒక్కో కాలేజీలో గరిష్టంగా 15 తరగతి గదులు ఉండాల్సి ఉండగా, 8 లేదా 9 గదులు మాత్రమే ఉన్నాయి.
అధ్యాపకులో రామచంద్రా...?
జూన్ 1న తరగతులు ప్రారంభిస్తుండటంతో అప్పటి నుంచే అధ్యాపకులు ఉండాలి. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 3,600 మంది మాత్రమే శాశ్వత అధ్యాపకులున్నారు. 1,654 మంది అతిథి అధ్యాపకులను నియమిస్తుండగా.. ఆ నియామకాలు మాత్రం జులై నెలాఖరు వరకు చేయడం లేదు. మొత్తం 422 జూనియర్ కళాశాలల్లో 18 కొత్తవి ఉన్నాయి. కొత్తగా ప్రారంభమైన వాటిలో మరో 225 మంది అధ్యాపకులు అవసరం. 15 కళాశాలలకు ప్రిన్సిపాళ్లే లేరు. మరోవైపు జూన్ 1 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనాన్ని ప్రారంభించనున్నట్లు ఇంటర్ బోర్డు ఇప్పటికే చెప్పింది. దాంతో పలు సబ్జెక్టుల అధ్యాపకులు 4 రోజుల నుంచి వారం పాటు ఆ పనిలో ఉంటారు. మరోవైపు అధ్యాపకుల కొరత వేధిస్తోన్న నేపథ్యంలో గెస్ట్ లెక్చరర్ల నియామాకంపై ప్రభుత్వానికి ఇప్పటివరకు పట్టింపులేదు. దీనికితోడు రాష్ట్రంలో కొత్తగా ప్రారంభమైన కళాశాలలో మరో 225 మంది అధ్యాపకులు అవసరం. 15 కళాశాలలకైతే ఏకంగా ప్రిన్సిపాళ్లే లేరు.
పాత పుస్తకాలతోనే కుస్తీ..
రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో చదివే స్టూడెంట్లకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందిస్తోంది. 2024–25 అకాడమిక్ ఇయర్‌కు సంబంధించి పుస్తకాల ప్రింటింగ్ బాధ్యతలను తెలుగు అకాడమీకి అప్పగించారు. దాదాపు మూడు లక్షల మందికి పుస్తకాలు అందించాల్సి ఉంది. జూన్ 1 నుంచి ఫస్టియర్ స్టూడెంట్లకు క్లాసులు మొదలుకానున్నాయి. అయితే ఇప్పటికీ కాలేజీలకు బుక్స్ అందలేదు. ఇంటర్ కాలేజీలకు కనీసం మరో 10 నుంచి 15 రోజుల వరకు పట్టవచ్చని చెబుతున్నారు. కళాశాలల పునఃప్రారంభం నాటికే ఆయా ఏర్పాట్లు పూర్తిచేసి పాఠాలు బోధించేలా చర్యలు తీసుకుని ఉండాల్సిందని తల్లిదండ్రులు అంటున్నారు. తల్లిదండ్రులు ఒకటో తేదీన తమ పిల్లలను చేర్పించడానికి వచ్చి అధ్యాపకులు లేరని తెలిస్తే వారికి నాణ్యమైన విద్య అందుతుందన్న నమ్మకం ఉంటుందా..? ప్రభుత్వ విద్యపై ఇక నమ్మకం ఏలా కలుగుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జూన్ 30 నాటికి తొలివిడత ప్రవేశాలు ముగుస్తాయి. అంటే అప్పటివరకు విద్యార్థులు చేరుతూనే ఉంటారు. ఇక రెండో, చివరి విడత ఆగస్టు వరకు కొనసాగుతాయి.
జూనియర్ కాలేజీలకు అరకొర నిధులు
గడిచిన మూడేళ్లలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అవసరమైన నిధుల్లో పావువంతు కూడా మంజూరు కాలేదు. నెలకు ఒక్కో కళాశాలకు కనీసం రూ.50వేల వరకు ఖర్చు అవుతుంది. పారిశుధ్యం, మరుగుడొడ్ల నిర్వహణకు రూ.10 వేలు, చాక్‌పీసులు, పరీక్షల నిర్వహణ, రిజిస్టర్లు ఇతరత్రా బోధనా సామాగ్రి కొనుగోలుకు మరో రూ.20వేల వరకు అవసరమవుతున్నాయి. విద్యార్థుల సంఖ్యను బట్టి ఈ ఖర్చు మరింత పెరుగుతుంది. కళాశాలల నిర్వహణకు మూడు నెలలకోసారి విడుదల చేయాల్సిన నిధులను యేళ్లు గడుస్తున్నా ఇవ్వడం లేదు. కొద్ది రోజుల కిందట కొన్ని నిధులను ప్రభుత్వం విడుదల చేసినట్టు చెబుతున్నా అవి ఇప్పటి వరకు ప్రిన్సిపాళ్ల ఖాతాలో జమకాలేదు. ప్రజాప్రభుత్వం అని చెబుతున్న కాంగ్రెస్ సర్కారు హయాంలోనైనా ప్రభుత్వ విద్య మెరుగు పడుతుందా..? లేదా అన్నది వేచిచూడాల్సిందే.