అక్రిడేషన్ కార్డులు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం
విశ్వంభర, హైదరాబాదు : రాష్ట్రంలో జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య విమర్శించారు. సోమవారం హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టు గోలి విజయకుమార్ సహా పలువురు జర్నలిస్టులకు టీడబ్ల్యూజేఎఫ్ సభ్యత్వ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా జర్నలిస్టుల ప్రధాన సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి గానీ, ఏ మీడియా సంస్థకు గానీ అనుబంధం కాదని స్పష్టం చేశారు. సంఘంపై కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అలాంటి ప్రచారాలను జర్నలిస్టులు నమ్మవద్దని సూచించారు. అన్ని జిల్లాల మహాసభలను త్వరలో పూర్తి చేసి రాష్ట్ర మహాసభను భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో కన్వీనర్ తన్నీరు శ్రీనివాస్, హైదరాబాదు జిల్లా కన్వీనర్ రవికుమార్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పాల్వాయి జానయ్య పాల్గొన్నారు.



