రేవంత్ రెడ్డికి రైతుల కంటే ఎన్నికలే ముఖ్యంగా మారాయి: కిషన్ రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డికి రైతులకంటే ఎన్నికలే ముఖ్యంగా మారాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ఇవాళ (గురువారం) ఆయన బీబీనగర్ మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ కేంద్రాలను సందర్శించారు.
సీఎం రేవంత్‌రెడ్డికి రైతులకంటే ఎన్నికలే ముఖ్యంగా మారాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ఇవాళ (గురువారం) ఆయన బీబీనగర్ మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ఇందిరమ్మ రాజ్యంలో రుణమాఫీ లేదు.. వడ్లకు బోనస్ లేదు అని చురకలు అంటించారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రైతులను బీఆర్ఎస్ మోసం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. గతంలో కేసీఆర్ వరి వేస్తే ఉరి అని రైతులను ఇబ్బందులకు గురిచేశారని... ఇప్పుడు, దొడ్డు వడ్లు సాగు చేస్తే బోనస్ ఇవ్వబోమని రేవంత్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు.
ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? అని కిషన్ రెడ్డి నిలదీశారు. రైతులకు రుణమాఫీ లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో రైతులకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వడం లేదన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రతి గింజను కొనేందుకు సిద్ధంగా ఉందన్నారు. రైతుల్లో వ్యతిరేకత మూటగట్టుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి పదేళ్లు పడితే... కాంగ్రెస్ ప్రభుత్వానికి 5 నెలలే పట్టిందన్నారు. దొడ్డు రకం వడ్లు వేసిన రైతులకు అన్యాయం చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని కిషన్ రెడ్డి హెచ్చరించారు.