ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణను తనిఖీ చేసిన కలెక్టర్
విశ్వంభర, భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియేట్ పరీక్ష కేంద్రాన్నిగురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మిక తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించి, విద్యార్థుల హాజరు శాతం గురించి చీఫ్ సూపరింటెండెంట్ ను అడిగి తెలుసుకున్నారు. సీ.సీ కెమెరా నిఘా నడుమ నిబంధనలకు అనుగుణంగా పరీక్ష నిర్వహించాలని, నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా లేదా పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి, అత్యవసర వైద్య సేవల కేంద్రం ఏర్పాటు, మరుగుదొడ్లు, కళాశాలలో ఎలాంటి వ్యర్దాలు లేకుండా పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పరీక్ష పూర్తయిన వెంటనే జవాబు పత్రాలను పోలీసు బందోబస్తు మధ్య క్లోస్డ్ వాహనంలో నిర్దేశిత కేంద్రాలకు తరలించాలని సూచించారు. ఎలాంటి మాల్ ప్రాక్టీసుకు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకంగా, పక్కాగా పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ వాచీలు వంటి ఉపకరణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించకూడదని, నిశిత పరిశీలనతో విద్యార్థులను అనుమతించాలని స్పష్టం చేశారు. వైద్య సేవల కేంద్రాన్ని పరిశీలించి మందులను పరిశీలించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. విద్యార్థులు ఏదేని అస్వస్థతకు గురైతే తక్షణ వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో భూపాలపల్లి తహసీల్దార్ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.



