బోనాల పండుగ తేదీలు ఖారారు.. ఏ తేదీల్లో ఎక్కడ అంటే..?
తెలంగాణలో బోనాల జాతర అంటే ఎంత వైభవంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది బోనాల పండుగ తేదీలను తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. జులై 7 నుంచి బోనాల పండుగ ప్రారంభం అవుతుందని ప్రభుత్వం తెలిపింది.
7వ తేదీన గోల్కొండ బోనాలతో పండుగ ప్రారంభమై జూలై 29న అంబారీ ఊరేగింపుతో ఉత్సవం ముగుస్తుంది. ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటన చేశారు. ఆమె ప్రకటనలో జూలై 21న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు, 22న ఉదయం 9:30 గంటలకు రంగం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
ఇక జులై 29న అక్కన్న, ఆదన్న ఆలయం దగ్గర అంబారీ ఊరేగింపు ఉంటుందని తెలిపారు మంత్రి సురేఖ. త్వరలోనే బోనాల పండుగపై పూర్తి స్థాయిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించాలని మంత్రి సురేఖ ఆదేశించారు. ఇక రాష్ట్రంలోని 28 ఆలయాల్లో ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తామని కూడా తెలిపారు.