అభివృద్ధి పథంలో భద్రాద్రి దేవస్థానం - కార్య నిర్వహణ అధికారి ఎల్ రమాదేవి
#సాంకేతిక పద్ధతుల ద్వారా పారదర్శకత # భవిష్యత్తులో భారీ ఆదాయ లక్ష్యాలు
విశ్వంభర, భద్రాద్రి కొత్తగూడెం : దక్షిణ ఆయోధ్యగా గుర్తింపు పొందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆదాయంతో పాటు వ్యయ పరంగా సమతుల్యత పాటిస్తూ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో దేవస్థానానికి రూ.74 కోట్లకు పైగా ఆదాయం సమకూరగా, వ్యయభారం కూడా గణనీయంగా పెరిగింది. ఈ పరిణామాలు దేవస్థాన అభివృద్ధిలో ఒక కీలక మలుపుగా మారాయి. ప్రభుత్వ నూతన విధానాలు, సాంకేతిక తో కూడిన మేనేజ్‌మెంట్ కారణంగా రెండేళ్లుగా దేవస్థాన ఆదాయం పెరుగుతోంది. 2016 ఫిబ్రవరి 16న దేవస్థానం ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఎల్ రమాదేవి పాలనపై దృష్టి సారించి, కంప్యూటరైజేషన్, వెబ్‌సైట్, మొబైల్ యాప్, బార్కోడ్ సిస్టం, డిజిటల్ రశీదుల అమలు వంటి పద్ధతుల ద్వారా భక్తుల సేవలకు పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా సిబ్బంది కొరత ఉన్నా కూడా ఉన్న ఉద్యోగులనే సర్దుబాటు చేసుకుంటూ విధులను నిర్వహిస్తున్నారు. ఎంతోకాలంగా దేవస్థానం లో విధులు నిర్వహిస్తున్న స్థానికులను వివిధ ఆలయాలకు బదిలీ చేయించారు. ఎంతోకాలంగా అన్యాక్రాంతమైన పురుషోత్తపట్నంలోని దేవస్థానం భూములను పరిరక్షించడంలో ఆమె చేస్తున్న కృషి అసామాన్యం. భూముల విషయంలో భూకబ్జాదారులు దేవస్థానం సిబ్బందిపై దాడి చేసిన సంఘటనలు, ఈవో ను సైతం కదలకుండా నిర్బంధించిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ ఆమె మొక్కవోని దీక్షతో జగన్ ప్రభుత్వంలోని మంత్రులను, అధికారులను కలిసి దేవస్థానం భూమి లను పరిరక్షించడంలో సహకరించాలని కోరారు. రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉండటంతో భూములను తిరిగి దేవస్థానానికి అప్పగించేందుకు ఆమె తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే గుంటూరు, తదితర ప్రాంతాల్లో ఉన్న రామయ్య భూములను కూడా దేవస్థానానికి తిరిగి స్వాధీనం చేశారు.
పెరిగిన రామలోరి ఆదాయం
ఆమె చేస్తున్న వివిధ సంస్కరణ ల ద్వారా రామయ్యకు గణనీయమైన ఆదాయం సమకూరుతుంది.ఆన్‌లైన్ ఆర్జిత సేవల ద్వారా రూ.3.60 కోట్లు ఆదాయం రాగా, సమగ్రంగా రూ.110 కోట్ల వరకు ఆదాయం నమోదు కావడం విశేషం. తెరిచినప్పుడు కూడా విశేషంగా ఆదాయం సమకూరుతుంది.ప్రసాదాల తయారీకి ప్రత్యేక ఖర్చులు ప్రతి ఏడాది ప్రసాదాల తయారీకి రూ.7 కోట్లు ఖర్చవుతున్నా, వీటి విక్రయాల ద్వారా విశేష ఆదాయం సమకూరుతోంది. అలాగే, భక్తుల వసతి కోసం ఏర్పాటు చేసిన కాటేజీలు, సత్రాల ద్వారా రూ.2.04 కోట్ల ఆదాయం వస్తోంది.
ఉద్యోగులకు గౌరవవేతనాలు – భద్రత చర్యలు
ఉద్యోగులకు జీతాల రూపంలో రూ.15 కోట్లకు పైగా ఖర్చవుతోందీ. అలాగే, భద్రత కోసం ఉన్న ప్రత్యేక బలగాలకు సంవత్సరానికి రూ.1.50 కోట్లు ఖర్చవుతోంది.
నిత్యాన్నదానానికి విశేష ఆదరణ
ప్రతి సంవత్సరం ఉచిత నిత్యాన్నదాన కార్యక్రమానికి రూ.2 కోట్లకుపైగా ఖర్చవుతోంది. దీని నిర్వహణ కోసం ఇప్పటి వరకు రూ.39 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో భద్రపర్చడం ద్వారా దీర్ఘకాలిక ఆదాయ మూలాన్ని ఏర్పాటు చేశారు.
భక్తుల నుంచి విశ్వాసం – మరింత ఆదాయానికి మార్గం
దేవస్థాన అభివృద్ధిలో భక్తుల మన్ననలు కీలకం. విరాళాలు ఇచ్చే దాతలకు సమాచారం పంపే వ్యవస్థను మెరుగుపరచాలని భక్తులు సూచిస్తున్నారు. దర్శనాల్లో మరింత అనుభవాన్ని కలిగిస్తే ఆదాయం మరింతగా పెరిగే అవకాశం ఉంది. ప్రసాదాల నాణ్యతను మెరుగుపర్చే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
భవిష్యత్తు లక్ష్యాలు
రాబోయే రెండేళ్లలో ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో దేవస్థానం ఈవో ముందుకు సాగుతోంది. నూతన విధానాలు, పారదర్శకత, భక్తుల ఆదరణ – ఇవన్నీ కలిసి భద్రాచల దేవస్థానం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది.