అన్నదాత ఆవేదన. - సోలిపేట ఐకేపీ కేంద్రంలో అక్రమాలు - రైతుల ఖాతాల్లో మాయమవుతున్న సొమ్ము - కలెక్టర్ స్పందించాలని బాధితుల డిమాండ్
విశ్వంభర, సూర్యాపేట:- మండలంలోని సోలిపేట ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న అవకతవకలు రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. నిబంధనల ప్రకారం చెల్లింపులు జరపాల్సి ఉండగా, రైతుల ఖాతాల్లో కోతలు విధిస్తుండటంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఈ మేరకు రైతులు వారి ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్రంలో ధాన్యం విక్రయించిన జానమ్మ అనే రైతు ఖాతాలో ఏకంగా రూ.18 వేలు తక్కువగా జమకాగా ఆరా తీసి ప్రశ్నించింది.. ఈ మేరకు కొంత మేర డబ్బులు తిరిగి ఇచ్చినట్టు తెలిపింది. మరో రైతు విష్ణు ఖాతాలో కోత విధించాగా రూ.10,500 తిరిగి ఇచ్చినట్టు తెలిపారు. ఐకేపీ కేంద్రాల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, అమాయక రైతుల సొమ్మును పక్కదారి పట్టిస్తున్నారని బాధితులు మండిపడుతున్నారు. జిల్లా కలెక్టర్ తేజస్, సివిల్ సప్లై అధికారులు తక్షణమే స్పందించి సోలిపేట కేంద్రంలో జరుగుతున్న లావాదేవీలపై విచారణ జరపాలని వారు కోరుతున్నారు. తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.



