పర్సనల్ టూర్ కోసం 50 మంది సిబ్బంది
- బిఎస్ఎన్ఎల్ డైరెక్టర్ తీరుపై కేంద్రం సీరియస్
విశ్వంభర, నేషనల్ బ్యూరో: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ సీనియర్ డైరెక్టర్ వివేక్ బంజల్‌పై కేంద్రం సీరియస్ అయింది. తన ప్రయాగ్‌రాజ్ పర్యటన ఏర్పాట్ల కోసం చేసిన డిమాండ్లు వైరల్ కావడంతో అతడికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తీవ్రంగా స్పందించారు. అధికారి ఇచ్చిన వివరణ ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఈ టూర్ వివాదం ఏంటంటే..?
వివేక్ బంజల్ ప్రయాగ్‌రాజ్ పర్యటనకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ సమయంలో 21 పనులు చేసేందుకు 50 మంది బీఎస్‌ఎన్‌ఎల్ సిబ్బందిని కేటాయించాలని డిప్యూటీ మేనేజర్ లెవెల్ ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ సిబ్బంది రైల్వేస్టేషన్‌లో ఆయన దిగగానే స్వాగతం పలకాలి. ఆలయ సందర్శనలు, బోట్ రైడ్స్‌ను సమన్వయం చేసుకోవాలి. టవల్స్, అండర్‌గార్మెంట్లు, నూనె, దువ్వెన వంటి వాటితో ‘స్నాన్’ కిట్స్ సిద్ధం చేయాలి. మతపరమైన కార్యకలాపాల కోసం రవాణా సౌకర్యాలు చూసుకోవాలి. ఫొటోలు తీయాలి. అలాగే ప్రయాణం కోసం ఏర్పాటుచేసిన వాహనాల్లో వాటర్ బాటిల్స్, చాక్లెట్లు, స్నాక్స్ ఉండేలా చూడాలి. ఈ విస్తృత సన్నాహాలకు సంబంధించిన ఆర్డర్ ఆన్‌లైన్‌లో వెలుగులోకి రావడంతో తీవ్ర వివాదమైంది. వనరుల దుర్వినియోగంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారం కేంద్రం దృష్టికి చేరడంతో ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని బంజల్‌ను ఆదేశించింది. ఈ ప్రవర్తన నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తుందని మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు.



