ఈడీ, సీబీఐలను మూసేస్తాం.. ఎస్పీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఈడీ, సీబీఐలను మూసేస్తామని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు దర్యాప్తు సంస్థల అవసరం ప్రభుత్వానికి లేదని ఆయన చెప్పారు. తమ కూటమి నేతలతో దీనిపై మాట్లాడుతానని అఖిలేష్ అన్నారు. సీబీఐ, ఈడీల అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ప్రతీ రాష్ట్రంలోనూ అవినీతి నిరోధక శాఖ ఉందని ఆయన గుర్తు చేశారు. అవినీతి ఆరోపణలు వస్తే ఏసీబీ చూసకుంటుందని అన్నారు. గత పదేళ్లలో ఈడీ, సీబీఐ సాధించిందేంటో చెప్పాలని అఖిలేష్ నిలదీశారు. బీజేపీ దాని ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి మాత్రమే ఈడీ, సీబీఐలను వినియోగించిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడంలో ఈడీ, సీబీఐలు కీలక పాత్రపోషించాయని విమర్శించారు.
బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారి కేసులను కాకుండా ఇతర కేసులను ఈడీ, సీబీఐ దర్యాప్తు చేశాయా అని నిలదీశారు. నోట్ల రద్దు సమయంలో అవకతవకలు జరిగితే ఈడీ, సీబీఐలు ఏం చేశాయని అన్నారు. ఈ రెండు సంస్థలను ఉపయోగించి బీజేపీ దోపిడీకి పాల్పడిందని అఖిలేష్ ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ రద్దు తర్వాత ఈ విషయం స్పష్టమైందని అన్నారు.
బీజేపీ ఎవరిపై అయినా అవినీతి ఆరోపణలు చేస్తే వాళ్లన్ని ఎన్డీఏలో కలవాలని పరోక్షంగా కోరుతున్నట్టేనని అన్నారు. ఎన్డీఏలో కలిస్తే వాళ్లని సీబీఐ, ఈడీ టచ్ చేయవని.. ఒకవేళ కలవకపోతే మాత్రం కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు పెడతాయని విమర్శించారు. కాబట్టి ఇలాంటి సంస్థల అవసరం దేశానికి మంచిది కాదని చెప్పారు. కేంద్రం దర్యాప్తు సంస్థలను మూసేసే ప్రతిపాదనను తప్పకుండా ఇండియా కూటమి ముందు ఉంచుతానని చెప్పారు.