రాజకీయ జీవితంలో గెలుపు ఓటములు సహజం : నవీన్ పట్నాయక్
దాదాపు పాతిక సంవత్సరాలుగా ఒడిశాలో తిరుగులేని నేతగా ఉన్న నవీన్ పట్నాయక్ ఈసారి ఓటమిని చవి చూడాల్సిన పరిస్థితి వచ్చింది.
విశ్వంభర, ఒడిశా: దాదాపు పాతిక సంవత్సరాలుగా ఒడిశాలో తిరుగులేని నేతగా ఉన్న నవీన్ పట్నాయక్ ఈసారి ఓటమిని చవి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఆ పార్టీ స్థానంలో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా అవతరించింది. ఒడిషాలో బీజేపీ ఫస్ట్ టైమ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఐదు టర్ములుగా పవర్‌లో ఉన్న బిజూ జనతాదళ్ కేవలం 53 స్థానాల దగ్గరే ఆగిపోయింది. తాజాగా ఓటమిపై నవీన్ పట్నాయక్ స్పందించారు.
ఆయన పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ జీవితంలో గెలుపు ఓటములు సహజం అని అన్నారు. ఓడిపోయామని సిగ్గు పడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని చెప్పారు. తాను తొలిసారి సీఎం అయినప్పుడు రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉండేవారని గుర్తుచేశారు. తన 24 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో దానిని 10 శాతానికి తగ్గించానని ధీమా వ్యక్తం చేశారు. బీజేడీ సేవలు ఇక్కడితో ఆగిపోవని.. ఇకపైనా కొనసాగుతాయని అన్నారు. కాగా, ఈ ఎన్నికల్లో బీజేపీకి 78, బీజేడీకి 51 సీట్లు వచ్చాయి.