వచ్చే జనగణనలో కుల గణన పారదర్శకంగా, శాస్త్రీయంగా నిర్వహించాలి
– డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు, మాజీ ఛైర్మన్ – తెలంగాణ బీసీ కమిషన్
డా. వకుళాభరణం ఓపెన్ లెటర్ ద్వారా ప్రధాన మంత్రికి సూచనలు పంపారు. బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్‌గా, సామాజిక న్యాయ విధానాల్లో నిబద్ధత కలిగిన పరిశోధకుడిగా కొన్ని కీలక అంశాలను కేంద్ర దృష్టికి తీసుకువచ్చారు.
దేశాన్ని అనేక సామాజిక, ఆర్థిక సవాళ్ల నుంచి ముందుకు నడిపిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అభినందిస్తున్నానని తెలంగాణ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలిపారు. ముఖ్యంగా వచ్చే జనగణనలో కుల గణనను చేర్చాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయానికి ధన్యవాదాలు తెలిపారు.
2025లో కుల గణన చేపట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేవలం పరిపాలనా ప్రక్రియ మాత్రమే కాదు. ఇది సామాజిక న్యాయానికి, రాజ్యాంగ సమానత్వానికి ఒక మైలురాయి. పీడిత వర్గాల వాస్తవ స్థితిగతులను ప్రపంచానికి చూపించే అరుదైన అవకాశం అని డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు పేర్కొన్నారు.
ఈ కుల గణన కార్యక్రమాన్ని శాస్త్రీయంగా, న్యాయపరమైన ప్రమాణాలతో, సామాజిక న్యాయపథంలో నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సామాజిక ఆర్థిక కుల గణన – 2011 లోపాలు – పాఠాలు
SECC–2011 గణన గ్రామీణ, పట్టణ అభివృద్ధి శాఖల ద్వారా నిర్వహించబడింది. ఈ గణనలో పద్ధతిలో స్పష్టత లేకపోవడం, 46 లక్షల కుటుంబాలు మరియు కులాల పేర్లు తప్పుగా నమోదు కావడం చోటు చేసుకున్నాయి.
వాటిలో పర్యాయ పదాలుగా కులాల పేర్లు, ఇంటి పేర్లు (surnames), గోత్రాలు కూడా తప్పుగా నమోదు అయ్యాయి. వర్గీకరణ జరగకపోవడం వల్ల డేటా విశ్వసనీయంగా మారలేదు. కేంద్రం సుప్రీంకోర్టుకు కూడా ఈ లోపాలను తెలిపింది.
రూ.5000 కోట్లు ఖర్చయినా, ఆ గణన డేటా పాలనా నిర్ణయాలకు ఉపయోగపడలేదు. 2015లో ఏర్పాటైన పనగరియా కమిటీ కూడా ఈ లోపాలను సరిచేయలేకపోయింది. నివేదిక ఇవ్వలేదు. కొనసాగిస్తూ ఎలాంటి తప్పులను సరిచేసే పనులు కొనసాగలేదని, కేవలం Excel షీట్‌లలో డేటా ఉంచడమే జరిగినందున సరిదిద్దడం సాధ్యపడకపోయినదని ఆ కమిటీ కొన్ని సందర్భాల్లో మీడియాకు వెల్లడించింది.
జనాభా గణన చట్ట సవరణ అవసరం ఎందుకు?
ప్రస్తుతం Census Act, 1948 ప్రకారం ప్రభుత్వం Section 4 ద్వారా అవసరమైన ప్రశ్నలను నిర్ణయించగలదు. కానీ:
- చట్టంలో కుల గణన తప్పనిసరిగా నిర్వహించాలి అనే స్పష్టత లేదు.
- గతంలో జరిగిన లోపాలు పునరావృతం కాకుండా, భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు ఎదురుకాకుండా చట్ట సవరణ అవసరం.
చట్టంలో స్పష్టత కల్పిస్తే గణనలో సేకరించిన డేటా ప్రభుత్వ విధానాలకు మరియు కోర్టుల్లో నమ్మదగిన ఆధారంగా ఉపయోగపడుతుంది.
డా. వకుళాభరణం సూచించిన కీలక అంశాలు
- అనేక న్యాయపరమైన తీర్పులు, సామాజిక చైతన్య నేపధ్యంలో — భవిష్యత్తులో యేలాంటి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు చట్ట సవరణను సమర్థవంతంగా చేయడం సముచితం.
- ఇంద్రా సాహ్నీ తీర్పు (పారా 810, 667) ప్రకారం 50 శాతం పైగా రిజర్వేషన్లకు గణాంక ఆధారాలు అవసరం.
- పుట్టస్వామి తీర్పు (2017) ప్రకారం కుల గణన గోప్యత హక్కుకు వ్యతిరేకం కాదు.
- SECC–2011 లోపాలు పునరావృతం కాకుండా నిపుణుల పర్యవేక్షణ అవసరం.
- జాతీయ నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి.
- బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి జనగణనకు సమన్వయం కల్పించాలి.
ముఖ్య విజ్ఞప్తి:
ఈసారి కుల గణన చట్టబద్ధంగా, న్యాయపరమైన ప్రమాణాలతో, శాస్త్రీయంగా జరగాలి. ఇది సామాజిక న్యాయ సాధనగా మారాలి.