10 నిమిషాల డెలివరీకి బ్రేక్

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

10 నిమిషాల డెలివరీకి బ్రేక్

ఆన్‌లైన్ డెలివరీ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది గిగ్ వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.

విశ్వంభర, నేషనల్ బ్యూరో: ఆన్‌లైన్ డెలివరీ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది గిగ్ వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రాణాలకు తెగించి డెలివరీ చేయాల్సిన పరిస్థితిని కల్పిస్తున్న వివాదాస్పద '10 నిమిషాల డెలివరీ' విధానాన్ని తక్షణమే ఎత్తివేయాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. గిగ్ వర్కర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ వంటి అన్ని ఈ-కామర్స్ సంస్థలు ఈ నిబంధనను పాటించాల్సిందేనని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించి డెలివరీ బాయ్స్‌పై ఒత్తిడి తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

క్విక్ కామర్స్ రంగంలో పెను మార్పు చోటుచేసుకోబోతోంది. అల్పాహారం నుండి నిత్యావసరాల వరకు కేవలం పది నిమిషాల్లోనే ఇంటికి చేరుస్తామంటూ ప్రచారం చేసుకున్న సంస్థలు ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నాయి. ప్రముఖ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్ తమ '10 మినిట్స్ డెలివరీ' సదుపాయాన్ని నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బ్లింకిట్‌, జెప్టో, స్విగ్గీ ఇన్స్‌టామార్ట్, జొమాటో ప్రతినిధులతో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అతి తక్కువ సమయంలో డెలివరీ చేయాలనే నిబంధన వల్ల డెలివరీ భాగస్వాములు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని, వారి భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు.

Read More అక్షయ్ కుమార్‌కు తప్పిన పెను ప్రమాదం

సమ్మెకు తలొగ్గిన కేంద్రం
గతేడాది డిసెంబర్ 25, 31 తేదీల్లో దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు సమ్మె చేపట్టారు. ఇండియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ యాప్‌ బేస్డ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌, తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్‌ వర్కర్స్‌ యూనియన్‌ పిలుపు మేరకు కార్మికులు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. 10 నిమిషాల డెలివరీ వల్ల రోడ్డు ప్రమాదాలు పెరగడమే కాకుండా, కార్మికులపై తీవ్రమైన మానసిక ఒత్తిడి కలుగుతోందని. దీన్ని రద్దు చేయాల్సిందే అని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. కార్మికుల ఆవేదనను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. వారి డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తూ ఈ డెలివరీ కాలపరిమితిని రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న డెలివరీ భాగస్వాములకు పెద్ద ఉపశమనం లభించినట్లయింది.