దేశంలో ‘లక్ష’ణంగా రికార్డు సృష్టించారు
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఏపీలో టీడీపీ విజయం సాధించగా కేంద్రంలో బీజేపీకి అనూహ్యంగా సీట్లు తగ్గాయి.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఏపీలో టీడీపీ విజయం సాధించగా కేంద్రంలో బీజేపీకి అనూహ్యంగా సీట్లు తగ్గాయి. ఎన్డీఏ 390- 400 సీట్లు సాధిస్తుందన్న అంచనాలకు భిన్నంగా ఫలితాలు వెలువడ్డాయి. అయితే, కొందరు అభ్యర్థులు ఊహించనంతగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. దేశవ్యాప్తంగా అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థుల్లో తెలంగాణ నేత ఉండటం విశేషం. ఐదు లక్షలకు పైగా మెజార్టీని సొంతం చేసుకుని ప్రభంజనం సృష్టించారు.
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిశంకర్ లాల్వాణీ అత్యధికంగా 11,75,092 ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు. ఆయన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి రక్బీల్ హుస్సేన్ ధుబ్రీ నుంచి పోటీ చేసి 10,12,476 ఓట్లను సాధించారు. బీజేపీ అభ్యర్థి శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశ నుంచి పోటీ చేసి 8,21,408 ఓట్లు సాధించారు. ఆయన తర్వాత స్థానంలో బీజేపీ అభ్యర్థి సీఆర్ పాటిల్ నిలిచారు. ఆయన 7, 73,551ఓట్లను సాధించారు.
అదేవిధంగా బీజేపీ అగ్రనేత అమిత్ షా గాంధీనగర్ నుంచి పోటీ చేసి 7,44,716ఓట్లు సాధించి మెజారిటీ లిస్టులో చేరారు. టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ 7,10,930ఓట్లు సాధించారు. ఈయన డైమండ్ హార్బర్ నుంచి పోటీ చేశారు. అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు సమానంగా సీట్లు సాధించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ 8, బీజేపీ 8, ఎంఐఎం ఒక స్థానాల్లో గెలుపొందాయి. వీరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి నల్గొండ నుంచి పోటీ చేసి 5,59,905 మెజారిటీ సాధించారు.