మట్టిలో మెరిసిన మాణిక్యం.. - HCA ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ -14 బాలుర క్రికెట్ టీం కు బొమ్మరబోయిన శివ దీక్షిత్ ఎంపిక
ఉమ్మడి నల్లగొండ జిల్లా టీంకు వైస్ కెప్టెన్ గా ఎన్నిక
On
విశ్వంభర, చండూరు :- పట్టుదలకు ప్రతిరూపం... తల్లిదండ్రుల ప్రోత్సాహం... కలగలసి మట్టిలో మెరిసిన మాణిక్యం ఈ బొమ్మరబోయిన శివ దీక్షిత్. మండలంలోని కస్తాల గ్రామానికి చెందిన బొమ్మరబోయిన సైదులు - కవిత దంపతుల మొదటి సంతానమైన ఇతను చండూరులోని కృష్ణవేణి స్కూల్ లో 8వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం నల్లగొండలోని మేకల అభినవ్ అవుట్ డోర్ స్టేడియం లో హెచ్ సి ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ -14 బాలుర క్రికెట్ టీం సభ్యుల ఎంపికలో ఉత్తమ ప్రతిభ కనబర్చి ఉమ్మడి నల్లగొండ జిల్లా టీంకు ఎంపిక కావడంతో పాటు జట్టుకు వైస్ కెప్టెన్ గా ఎన్నిక కావడం ఎంతో సంతోషకరమైన విషయం. కృషి వుంటే మనుషులు ఋషులవుతారు అన్నది అక్షరాల నిజం చేశాడు శివ దీక్షిత్. ఒక మారుమూల పల్లె అయినా కస్తాలలో పేద కుటుంబంలో జన్మించి, ఎలాంటి ఆట స్థలం అవకాశాలు లేకున్నా తన స్వయంకృషితో ఆట మీద ఉన్న మక్కువతో నిత్యం ప్రాక్టీస్ చేసి నేడు జిల్లా టీంకు ఎంపిక కావడం విశేషం. భవిష్యత్ లో అందివచ్చిన అవకాశంతో తను మంచి ప్రతిభ కనబర్చి ఉత్తమ స్థానంలో ఉండాలని అందుకు హెచ్ సీ ఎ ఎంపిక దోహదపడాలని ఆశిద్దాం.... అమ్మ నాన్నల ప్రోత్సాహమే..... అమ్మానాన్నలు అందించిన ప్రోత్సాహంతోనే పట్టుదలతో ప్రయత్నం చేశానని, కృషి ఫలితమే తాను ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టుకు ప్రధాన బౌలర్ గా ఎంపిక కావడం జరిగిందని శివదీక్షిత్ తెలిపారు. జట్టులో సభ్యుడిగా ఎంపికవడంతో పాటు వైస్ కెప్టెన్ గా ఎంపికవ్వడం చాలా ఆనందం కలిగించిందని అన్నారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ తన ప్రతిభను గుర్తించి ఎంపిక చేసిన నల్లగొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సయ్యద్ అమీనుద్దీన్, కోచ్ లు షఫీ, బుచ్చిబాబు లకు, మరియు ప్రోత్సహించిన అమ్మానాన్నలకు ధన్యవాదాలు తెలియజేశారు. వచ్చిన అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకొని రాగల రోజుల్లో తన భవిష్యత్తుకు బాటలు వేసుకోగలనని ఆశాభావం వ్యక్తం చేశారు.



