భక్తుల సంఖ్య అంచనాతో మేడారం జాతర అభివృద్ధి :మంత్రి కొండా సురేఖ
- ఆదివాసీ ఆచారాలు, ఆథ్యాత్మికతతో ఆలయ నిర్మాణం
- మేడారం సమ్మక్క జాతర పనులను మంత్రులు పొంగులేటి, సీతక్కతో పరిశీలించిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
విశ్వంభర,మేడారం : ఆసియా ఖండంలోనే అతి ఆదివాసీ, గిరిజన జాతర మేడారం భక్తుల సంఖ్య అంచనా ఆధారంగా అభివృద్ధి పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. ప్రస్తుతం చేపడుతున్న ప్రతి నిర్మాణంలో ఆదివాసీ, గిరిజన, కోయ ఆచారాలు, ఆథ్యాత్మిక చింతన ప్రస్పుటించాలని స్పష్టం చేశారు. శుక్రవారం వరంగల్ ఇన్‌ఛార్జి మంత్రి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయితీరాజ్ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ఎంపీ బలరాం నాయక్ తదితర అధికారులతో కలిసి ఆలయ సంబంధిత నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని మేడారంలో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులను చేపడుతున్నామన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు ఆలయ నిర్మాణ పనులు నిర్ధేశించిన గడువులోగా పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆదివాసీ ఇలవేల్పులు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలున్న ప్రాంగణాన్ని లక్షలాది భక్తులు దర్శించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తామన్నారు. రోడ్డు నిర్మాణ పనులు, డివైడర్లు, ప్లాంటేషన్ తదితర పనులు పూర్తి కావడానికి 24 గంటలు నిరంతరం పని చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. గద్దెల దర్శనం, బంగారం (బెల్లం) సమర్పణ... జంపన్న వాగులో స్నానాలు ఆచరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రధానంగా గుడి ప్రాంగణంలో చేస్తున్న అభివృద్ధి పనులను, జంపన్న వాగు, స్తూపం నుండి బస్టాండ్ వరకు జరిగే రోడ్ల విస్తరణను ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులతో పరిశీలించారు. ఈ పరిశీలనా కార్యక్రమంలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఆర్ అండ్ బి ఈ ఎన్సీ మోహన్ నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానొత్ రవి చందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, రాష్ట్ర నాయకులు మనోజ్ కుమార్, మండల మాజీ అద్యక్షులు జాలపు అనంత రెడ్డి, జిల్లా నాయకులు, మండల నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.



