Ravi Teja: సంక్రాంతి సినిమాలకు ఏపీ గ్రీన్ సిగ్నల్..!!
విశ్వంభర సినిమా: సంక్రాంతి పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమాలకు ప్రత్యేక సౌలభ్యాలు కల్పిస్తోంది.
సంక్రాంతి పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమాలకు ప్రత్యేక సౌలభ్యాలు కల్పిస్తోంది. ఇప్పటికే ప్రభాస్ నటించిన ది రాజా సాబ్, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు చిత్రాలకు టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలు, అదనపు ప్రదర్శనలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అదే కోవలో మరో రెండు కీలక చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రవితేజ ప్రధాన పాత్రలో నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి (జనవరి 13 విడుదల) నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు (జనవరి 14 విడుదల) సినిమాలకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అధికారికంగా అనుమతి లభించింది. ఈ మేరకు సంబంధిత శాఖ మెమో జారీ చేసింది. సంక్రాంతి రేసులో ఉన్న ఈ చిత్రాలకు అదనపు షోలు నిర్వహించుకునే వెసులుబాటు కూడా కల్పించారు.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ.50 వరకు పెంచుకునే అవకాశం ఉంది. అలాగే మల్టీప్లెక్స్‌లలో జీఎస్టీతో కలిపి రూ.75 వరకు ధరలు పెంచుకోవచ్చు. ఈ పెరిగిన టికెట్ ధరలు సినిమా విడుదలైన తేదీ నుంచి వరుసగా 10 రోజుల పాటు అమల్లో ఉంటాయి. పండుగ రోజుల్లో ప్రేక్షకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎక్స్‌ట్రా షోలు వేసుకునే వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పించింది.
భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో మాస్ మహారాజా రవితేజకు జోడీగా డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ నటిస్తున్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా హాస్యం, భావోద్వేగాలతో కూడిన పూర్తి స్థాయి సంక్రాంతి ఎంటర్‌టైనర్‌గా రానుంది.
ఇక అనగనగా ఒక రాజు చిత్రంలో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా కనిపించనున్నారు. మారి దర్శకత్వం వహించిన ఈ సినిమా రొమాంటిక్ కామెడీకి థ్రిల్లర్ అంశాలు జోడించి, ముఖ్యంగా యూత్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ రూపొందించారు. ఈ రెండు చిత్రాలకు లభించిన ప్రభుత్వ అనుమతులతో సంక్రాంతి బాక్సాఫీస్ పోటీ మరింత హీట్ ఎక్కనుంది.



