సీఎం గారూ.. ఇచ్చిన మాట నిలబెట్టుకోండి

సీఎం గారూ.. ఇచ్చిన మాట నిలబెట్టుకోండి

విశ్వంభర,హైదరాబాద్ : సంవత్సరాలు గడుస్తున్నా. ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మాత్రం మారడం లేదని సమగ్ర శిక్ష ఉద్యో గులు కన్నీటి పర్యంతమవుతున్నారు . వారి ఇబ్బందులు, కష్టాలను పాలకులు గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం టైం స్కేల్ ఇస్తామని ప్రకటించి పాలాభిషేకాలు చేయించుకుని మోసం చేసిందన్నారు. అలాగే అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ కూడా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్ల సాధనకు అనేక ఉద్యమాలు చేస్తున్న అరణ్యరోదనగానే  మిగిలిపోయిందని బాధపడుతున్నారు .
తమ ఉద్యోగాలు క్రమబద్ధీకరించండని సమగ్ర శిక్షా ఉద్యోగుల వేడుకొంటున్నారు.

పాఠశాల విద్యాశాఖలో భాగమైన సమగ్ర శిక్షాలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని  సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగులు వేడుకుంటున్నారు. 2023 సెప్టెంబర్ 13న సమగ్ర ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం హనుకొండ ఏకశిల పార్కు వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని అప్పటి టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి  గారు సందర్శించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వందరోజుల్లో సమస్యలను పరిష్కరించి ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై  రెండు సంవత్సరాలు కావస్తున్నా తమ సమస్యల పరిష్కారంలో అతిగతీ లేదని సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్ష ఉద్యోగులు ముక్తకంఠంతో వేడుకుంటున్నారు.

Read More ఇందిరాపార్క్ బీసీ ధర్నాకు సంఘీభావం. 

 సమగ్ర శిక్షాలో తెలంగాణ  రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా,మండల ,స్కూల్ కాంప్లెక్స్,పాఠశాల  స్థాయిలో 22,145 మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేస్తున్నారు.  జిల్లా ప్రాజెక్ట్ కార్యాలయాలలో 388 మంది, మండల కార్యాలయంలో ఎంఐఎస్ కో- ఆర్డినేటర్లు 463 మంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 492 మంది, క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు 2027మంది, ఐఈఅర్పిలు 982 మంది, పార్ట్ టైం ఇన్స్ ట్రక్టర్లు 2675 మంది, మెసెంజర్లు 602 మంది. కస్తూర్బా బాలిక విద్యాలయాల్లో 12,824 మంది, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 528, కేజీబివి టైప్  హాస్టల్ లలో 1152 మంది తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్నారు. వీరంతా గత బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాల క్రమబద్ధీకరణకు అనేకమార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. అయితే 2023 ఆగస్టు నెలలో పాఠశాల విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించి, అందోళనలు చేపట్టారు. అనంతరం సెప్టెంబర్ మాసంలో సమ్మెలో భాగంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టి 22 రోజుల పాటు కొనసాగించారు.అసెంబ్లీ  ఎన్నికల ముందు జరిగిన ఈ దీక్షలలో నల్గొండలో ప్రస్తుత రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫి  మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ,ములుగు జిల్లాలలో జరిగిన దీక్షలో పంచాయితీ రాజ్ మంత్రి సీతక్క దీక్షలకు ప్రత్యక్షంగా హాజరై సంఘీభావం తెలిపారు . పౌరసరఫరాలు,నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైతే ప్రతి టీవీ చానెల్ టిబెట్లో సమగ్ర శిక్షా ఉద్యోగులను కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు.అదే విధంగా 2013 సెప్టెంబర్ 13న ప్రస్తుత ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, కె నాగరాజు
సమక్షంలో ఏకశిలా పార్కు వద్ద సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సీఎం రేవంత్ రెడ్డి అప్పటీ టీపీసీసీ అధ్యక్షుని హోదాలో సందర్శించి మాట్లాడి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంద రోజుల్లో  సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు.బీఆర్ఎస్ పాలనలో సమగ్ర శిక్ష ఉద్యోగులు వెట్టి చాకిరికి గురై కనీస వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని సూచించారు, ఇవాళ ప్రభుత్వం అనుకుంటే ఒక గంటలో మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇవాళ కూర్చోబెట్టి మాట్లాడితే పరిష్కరించగలిగిన సమస్యలు మిమ్మల్ని కూర్చో బెట్టి మీరు చాయ్ తాగేలోపు జీవో ఇచ్చి పంపవచ్చు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలవుతున్నా ఇప్పటి వరకు తమ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయడంలేదని సమగ్ర శిక్షా ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసి లేదా కనీసం మినిమం టైం స్కేల్ అమలు చేయాలని కోరుతున్నారు. రాజ్యాంగబద్ధంగా అధికరణ 16 ప్రకారం, జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా డిగ్రీ, బీఈడీ, టెట్ ఉత్తీర్ణతతో పాటు కలెక్టర్లు చైర్మన్ గా, డీఈఓ, జిల్లా ప్రాజెక్ట్ అధికారి (ఆర్వీఎం) కన్వీనర్ గా ముగ్గురు సభ్యుల జిల్లా సెలక్షన్ కమిటీచే ఎంపిక కాబడ్డారు .

 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగంలో చేరిన దగ్గరి నుండి 300లకు పైగా సమగ్ర శిక్షా ఉద్యోగులు మరణించారు. ఈ  సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే సంగారెడ్డి జిల్లా చేగుంట మండలానికి దేవసోత్ రమేష్ (39),ఎర్ర శ్రీనివాస్ (38) మక్కరాజు పేట జడ్పీ ఉన్నత పాఠశాల నుండి ఎంఈఓ ఆఫీస్ కు రిపోర్ట్ లు అందజేయడానికి వెళుతుండగా ట్రాలీ ఆటో ఢీకొట్టడంతో ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులు చనిపోయారు. నేటి వరకు వారికి కనీసం పునరల్ చార్జీలు అందించని  ప్రభుత్వాలు ఉండడం దురదష్టకరం. విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదాలకు కొందరు చనిపోతే చాలీచాలని వేతనాలతో, అప్పుల బాధ భరించలేక గుండె నొప్పితో మరికొందరు చనిపోయారు. . కానీ ప్రభుత్వం నేటికీ ఏ ఒక్కరిని ఆదుకోలేదు. ఉద్యోగ భద్రత లేకపోవడంతో వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. వీరందరి ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేయాలని,ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్  చేస్తున్నారు.


 *సమగ్ర శిక్షా ఉద్యోగులకు బేసిక్ పే అమలు చేయాలి. తిరందాసు సంతోష్ కుమార్ (తెలంగాణ సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఎంప్లాయీస్ అసోసియేషన్, రాష్ట్ర అధ్యక్షులు ) 

 సమగ్ర శిక్షా ఉద్యోగులకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దించితే మీ సమస్యలు పరిష్కారమవుతాయని సిఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని అర్హతలు వుండి ,వారితో సమానంగా పనిచేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఇచ్చిన హామీని దృష్టిలో పెట్టుకుని తమకు బేసిక్ పే అమలు చేయాలి.సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.గురుకుల,మోడల్ స్కూల్, డిఎస్సీ నియామకాల్లో  30% వేయిటేజి ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చినట్లుగా చనిపోయిన కాంట్రాక్టు ఉద్యోగులకు  5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.పోరాడి సాధించుకున్న తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు తక్కువగా ఉండడం శోచనీయమని అన్నారు.

Tags: