పాక్‌ దాడులకు దీటుగా జవాబిద్దాం

- అఖిలపక్ష భేటీలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ వెల్లడి -ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన పార్టీల నేతలు

పాక్‌ దాడులకు దీటుగా జవాబిద్దాం

ఢిల్లీ444: ఉద్రిక్తతల్ని పెంచాలని భారత్‌ అనుకోవడం లేదని, పాక్‌ దాడిచేస్తే మాత్రం దీటుగానే జవాబిస్తామని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. పాకిస్థాన్, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లలో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై సైన్యం చేసిన దాడుల్లో కనీసం 100 మంది కరడుగట్టిన ముష్కరులు, వారి అనుచరులను అంతమొందించామని వెల్లడించారు. అత్యంత కచ్చితత్వంతో భారత సైన్యం పనిచేసిందని కొనియాడారు. దీనికోసం ఉద్దేశించిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కొనసాగుతోందని చెప్పారు. ఈ ఆపరేషన్‌ గురించి వివరించేందుకు గురువారం పార్లమెంటు గ్రంథాలయ భవనంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి ప్రసంగించారు. దాడులు జరిపిన తీరును తొలుత ఆయన వివరించారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు లేవనెత్తిన అంశాలకు సమాధానమిచ్చారు. 

అమాయకులకు నష్టం కలగనివ్వలేదు 

‘‘దాడుల్లో అమాయకులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకున్నాం. సైనికులు చూపిన ధైర్యసాహసాలు మనకు గర్వకారణం. నాణ్యమైన ఆయుధాలు మనవద్ద ఉన్నాయి. ఆయుధ తయారీలో చాలావరకు స్వయంసమృద్ధి సాధించి ప్రపంచ మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నాం. ఆయుధ తయారీలో బ్రాండ్‌ భారత్‌ తనదైన గుర్తింపు పొందింది’’ అని రాజ్‌నాథ్‌ తెలిపారు. రూ.24,000 కోట్ల మేర ఉన్న ఆయుధాల ఎగుమతి విలువను రూ.50,000 కోట్లకు తీసుకెళ్లాలని, భారత ఆయుధ సంపత్తి గొప్పదనాన్ని త్వరలోనే ప్రపంచం గుర్తిస్తుందని చెప్పారు. పోరు ఇంకా కొనసాగుతున్నందువల్ల దేశ ప్రయోజనాల దృష్ట్యా కొన్ని రహస్య వివరాలను ఈ దశలో చెప్పలేమన్నారు. ఈ సమావేశంలో పార్టీలకతీతంగా నేతలంతా ప్రభుత్వానికి మద్దతు ప్రకటించి పూర్తి సంఘీభావం చాటారు. సైనికదళాల సేవలపై ప్రశంసలు కురిపించారు. ఉగ్రదాడి తర్వాత ఇది రెండో అఖిలపక్ష భేటీ. కేంద్రం తరఫున రాజ్‌నాథ్‌తోపాటు మంత్రులు అమిత్‌ షా, ఎస్‌.జైశంకర్, జె.పి.నడ్డా, నిర్మలా సీతారామన్‌ పాల్గొన్నారు. విపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, సందీప్‌ బందోపాధ్యాయ్, టి.ఆర్‌.బాలు తదితరులు హాజరయ్యారు. ప్రధాని మోదీ సందేశాన్ని రాజ్‌నాథ్‌ వినిపించారు.

Read More వచ్చే జనగణనలో కుల గణన పారదర్శకంగా, శాస్త్రీయంగా నిర్వహించాలి

Tags: